200 పరిశ్రమలు ఉన్నా పక్క మండలాలపైనే ఆధారం

200 పరిశ్రమలు ఉన్నా పక్క మండలాలపైనే ఆధారం
  • తరచూ ఫైర్ యాక్సిడెంట్లతో భారీగా ఆస్తి నష్టం
  • స్థలం కోసం చూస్తున్నామంటున్న అధికారులు

మెదక్ (మనోహరాబాద్), వెలుగు: మెదక్‌‌  జిల్లా తూప్రాన్‌‌, మనోహరాబాద్‌‌ మండలాల పరిధిలో ప్రభుత్వం వందల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినా.. ఫైర్‌‌‌‌ స్టేషన్ మాత్రం ఏర్పాటు చేయడంలేదు.  దీంతో ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడల్లా తీవ్ర నష్టం కలుగుతోంది. ప్రతినెలా మూడు నాలుగు ప్రమాద ఘటనలు జరగుతూనే ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా పరిశ్రమల యజమానులు పక్క మండలాల్లోని ఫైర్ స్టేషన్లపై ఆధారపడాల్సి వస్తోంది.  కానీ అక్కడి నుంచి  ఫైర్ ఇంజిన్, సిబ్బంది వచ్చే సరికి విలువైన వస్తువులు కాలి బూడిదై పోతున్నాయి. 

హైవే 44 పక్కనే ఉన్నా..

మెదక్ జిల్లాలో నేషనల్​హైవే 44 పక్కన ఉన్న  తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో దాదాపు 200  పరిశ్రమలు ఉన్నాయి.  ప్రభుత్వం మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్ లో 750 ఎకరాల్లో ఆటోమేటివ్ పార్క్ ఏర్పాటు చేసింది. అలాగే కూచారం, కొండాపూర్ లో భారీ పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్‌‌లు, పెద్ద పెద్ద గోడౌన్‌‌లు ఉన్నాయి. షార్ట్​సర్క్యూట్, గ్యాస్‌‌, కెమికల్స్‌‌ లీకేజీ తదితర కారణాలతో తరచూ పరిశ్రమల్లో ఫైర్​యాక్సిడెంట్‌‌లు జరుగుతున్నాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగి విలువైన సామగ్రి కాలిపోతోంది. కొన్ని సందర్భాల్లో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న వర్కర్లు గాయపడుతున్నారు. 

దూరం నుంచి వచ్చే సరికి..

రెండు మండలాల పరిధిలోనూ ఫైర్ స్టేషన్ లేదు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే 30 ,- 40 కిలో మీటర్ల దూరంలో ఉండే  నర్సాపూర్, రామాయంపేట మండలాల నుంచి ఫైర్ ​ఇంజిన్ ​రావాల్సి వస్తోంది.  గంటకు పైగా సమయం పడుతుండడంతో అప్పటికే  భారీ నష్టం వాటిల్లుతోంది.  దీంతో స్థానికంగా ఫైర్‌‌‌‌ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆయా కంపెనీల యాజమాన్యాలు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన రావడం లేదు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో మరిన్ని ప్రమాదాలు జరిగే అస్కారం ఉందని,  ఇప్పటికైనా ఫైర్‌‌‌‌ స్టేషన్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

పర్మిషన్​ వచ్చింది 

ఇండస్ట్రియల్ ఏరియాలో ఫైర్‌‌‌‌ స్టేషన్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. తూప్రాన్‌‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ప్రస్తుతం స్థల పరిశీలన చేస్తున్నం.  వీలైనంత త్వరగా స్టేషన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటం. - గౌతమ్, జిల్లా ఫైర్ ఆఫీసర్, మెదక్

పలు సంఘటనలు

  •     ఫిబ్రవరి 27న ముప్పిరెడ్డిపల్లిలోని మూత పడిన జీఎస్​ ఫ్యాక్టరీలో ఫైర్​ యాక్సిడెంట్​ జరిగింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 
  •     మార్చి 1న  కూచారం పారిశ్రామిక వాడలోని వాల్వో ప్రొడక్ట్​ ఫ్యాక్టరీలో ఫైర్​ యాక్సిడెంట్​జరిగి  పెద్ద ఎత్తు వైర్లు, క్యాంటిన్​ లోని సామగ్రి కాలిపోయాయి.
  •     మార్చి 24న ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని కిసాన్ ఇండస్ట్రీస్ ఎల్ ఎల్ పీ కాపర్ కంపెనీలో అగ్రి ప్రమాదం జరిగింది. బాయిలర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ కావడంతో మండలు చెలరేగి రూ.1.90 కోట్ల  ఆస్తి నష్టం జరిగింది.