బీఆర్ఎస్​కు భవిష్యత్తు లేదు! 

బీఆర్ఎస్​కు భవిష్యత్తు లేదు! 

  తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల నుంచి చూసినా బీఆర్ఎస్​కు భవిష్యత్తు కనిపించడం లేదు. పది ఏండ్లు తెలంగాణలో పాలన చేసిన మాజీ సీఎం కేసీఆర్ పట్ల జనంలో వచ్చిన వ్యతిరేకత ఇంతా అంతా కాదు. ఉద్యమం సందర్భంగా, ఆ తర్వాత కేసీఆర్​ను నెత్తినెక్కించుకున్న జనం పది ఏండ్ల తర్వాత ఆయనను నేలకేసి కొట్టిన తీరులో ఒక ఆత్మాభిమానం దాగి ఉన్నది. నిరంకుశత్వ పాలనపై ధిక్కారం కనిపించింది.  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల జనంలో ఆదరణ, అభిమానం పెరిగింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్​కు మంచి రోజులు వచ్చే పరిస్థితి ఉన్నదా? అంటే ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

కేసీఆర్​ పార్టీకి ఇప్పటి నుంచే కష్టాలు మొదలు అయిపోయాయి. మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లోకి జంప్ జిలానీలు వెళ్లి పోతున్నారు. వలసలు స్పీడుగా కొనసాగుతున్నాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీఆర్ఎస్​లో ఉండడానికి ససేమిరా అంటున్నారు. అవిశ్వాస తీర్మానాలు విజయవంతం అవుతున్నాయి. బీఆర్​ఎస్​ కుప్ప కూలే పరిస్థితి వచ్చేసింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వంటి కేసీఆర్ నిర్ణయాలు కూడా ఒక రకంగా నిర్మాణం లేని పార్టీ ఉట్టికి ఎగిరినట్లు అయ్యింది.

ప్రజలు ఎన్నడూ పట్టలే

 ప్రముఖ నటుడు కమలహాసన్ చాలా కలలు కంటాడు అంటారు.  కలవస్తే చాలు దానిని కథగా మలిచి ఒక సినిమా తీస్తాడు అంటారు. మన మాజీ సీఎం కేసీఆర్ కూడా కొన్ని పథకాలు అలాగే అమలు చేశారు అంటారు. ఇందులోనే ఆయన సక్సెస్ కమ్​ ఫెయిల్యూర్ దాగి ఉంది. ఈ రెండింటి నడుమ అహం, గర్వం, జనంను కలువక పోవడం, ప్రజల్లోకి కేవలం ఎన్నికల నాడే వెళ్లడం, అవే ముచ్చట్లు చెప్పుడు, వచ్చుడు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం కనీసం ఏదైనా విషయం చెప్పడానికి అపాయింట్​మెంట్ కూడా​ ఇవ్వక పోవడంలాంటివి వెరసి ఓటమికి కారణంగా పేర్కొనవచ్చు.

ఓడిన తర్వాత కూడా  మాజీ మంత్రి కేటీఆర్​ లాంటి వారి అహం మాటలు, సమీక్షా సమావేశాల్లో ఎందుకు తాము ఓడాం?  జనంలో పచ్చి పులుసు పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేది గుర్తించకుండా, బీఆర్ఎస్ కన్నా  అద్భుతంగా పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద అర్థం, పర్థం లేని, పూర్తి ఓర్వలేని ఆరోపణలు, విమర్శలు చూసి జనం నవ్వుకునే పరిస్థితి ఉన్నది. 

మనుగడ కష్టమే

నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని వెళ్లి కలిస్తేనే ఝలక్ తింటున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఎంతమంది బీఆర్ఎస్ లో మిగిలి ఉంటారో చూసుకోండి అనాలని అనిపిస్తున్నది.  ఇతర మనుషుల పట్ల ఏమాత్రం గౌరవం లేని అధినేతల కుటుంబ పార్టీ బీఆర్ఎస్! ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకిక వాదం పట్ల గౌరవం లేని మాజీ సీఎం కేసీఆర్​కు, అటు కేంద్రంలో పీఎం నరేంద్ర మోదీకి, వాళ్ళ ముచ్చట్లు, మాటలకు, ఆచరణకు, మరీ ముఖ్యంగా వ్యక్తి గత తానా షాహీ గిరి కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో  రానున్న పార్లమెంట్ ఎన్నికలలో  బీఆర్ఎస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టంగానే  కనిపిస్తున్నది. అనవసరంగా ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల మీద నోరు పారేసుకోవడం మాని, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీద దృష్టి సారిస్తే మంచిదేమో! నిజం చెప్పాలంటే చాలామంది మేధావి, విద్యార్థి, యువత, కార్మిక, రైతు, కూలీల, మహిళల దృష్టిలో ఇప్పుడే తెలంగాణ వచ్చింది అనే చర్చ ఉంది. ఒక సంతోషం, సంతృప్తి ఉంది. బీఆర్ఎస్ పదిఏండ్ల పాలన అంతా ఒక నిరంకుశ, ఒక పీడ కలగా టాక్  ఉంది. .\

- ఎండి.మునీర్, సీనియర్ జర్నలిస్టు,