పాలన రథానికి ఉద్యోగ, ఉపాధ్యాయులే చక్రాలు. వారిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. కానీ అనాదిగా ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా సరైన వైద్యసేవలు అందించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కు అక్రమాల జబ్బు సోకి మరుగున పడింది. గత ఏడాది కాలంగా ఈహెచ్ఎస్ పథకం కింద వైద్య సేవల కోసం వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కొన్ని ఆస్పత్రులు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి.
గ త కొంత కాలంగా ఈహెచ్ఎస్ కు సంబంధించి రూ. 350 కోట్ల వరకు బకాయిలు ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ పథకం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ దశలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రీమియంతో కూడిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకుగాను ప్రతినెల మూల వేతనంలో 1-2 శాతం ప్రీమియం చెల్లించడానికి సిద్దంగా ఉన్నామని చెప్తున్నారు.
ఒత్తిళ్లతో అనారోగ్యాలు..
పాలకుల విధానాలు, మారుతున్న ధోరణుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం కత్తిమీద సాములా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఉద్యోగులపై పని భారం పెరిగింది. నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేయాల్సి వస్తుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టడం లేదు. దీనివల్ల సెలవులు తీసుకోకుండా రాత్రింబవళ్ళు నిరంతరాయంగా పని చేయడం వల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం, దృష్టి మాంద్యం వంటి అనేక రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన ఉద్యోగ ఉపాధ్యాయులు అనారోగ్యంతో సతమతమవుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో
ఉమ్మడి రాష్ట్రంలో 1972 నుంచి అమలవుతున్న సమీకృత వైద్య సహాయ నిబంధనలకు అనుగుణంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని అప్పటి ప్రభుత్వాలు అమలు చేశాయి. దీని ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డబ్బులు చెల్లించి వైద్యం పొంది చికిత్స అనంతరం బిల్లులు సమర్పిస్తే నిధులను ప్రభుత్వం విడుదల చేసేది. కానీ ఆ పథకంలోనూ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వైద్య బిల్లుల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం నెలల తరబడి ఎదురు చూడడం ఇబ్బందికరంగా మారింది. ఉద్యోగులు వైద్య చికిత్సల కోసం వచ్చిన మొత్తం డబ్బులు కాకుండా అందులో సగం వరకే ప్రభుత్వం మంజూరు చేసేది.
భరోసా ఇవ్వని ఈహెచ్ఎస్
తెలంగాణ వచ్చాక ఉద్యోగులందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తామని కేసీఆర్చెప్పిన మాటలు అందరికీ తెలిసినవే. అలాగే, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు ఉచిత వైద్య సేవల పథకాన్ని తేవాలని కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల వినతులను పట్టించుకొని 2014 నవంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు పరుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు గత ఎనిమిదేళ్లుగా అమలుపరుస్తున్న ఈ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సరైన ఆరోగ్య భరోసా ఇవ్వలేకపోతున్నది. ఈ పథకం కింద ప్రవేశపెట్టిన హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత చికిత్సలు పొందే వీలు ఉన్నా కూడా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం వల్ల ఉద్యోగులు సరైన వైద్యం పొందలేకపోతున్నారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు తమకు లాభం కలిగించే ట్రీట్మెంట్ మాత్రమే ఈహెచ్ఎస్ కింద అందిస్తున్నాయి.
ప్రాథమికంగా ఓ.పి స్థాయిలో చూపించుకునేందుకు ఆయా జిల్లాలో 14 వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేసినా సరైన వైద్య పరికరాలు, యంత్రాలు లేక మందులు అందక ఉద్యోగుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈ పథకం కింద కార్పొరేట్ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్ల వరకు బకాయిలు పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రులు హెల్త్ కార్డులను అనుమతించడం లేదు. రాష్ట్రంలో ఈ హెచ్ఎస్ పథకం సరిగా అమలు కాకపోవడంతో దానికి సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు పరుస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ఈ పథకాన్ని పొడగిస్తూ ఈ రెండు ఆరోగ్య పథకాల ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు నామ మాత్రం వైద్య సేవలను అందిస్తున్నారు.
ప్రీమియంతో కూడిన వైద్యసేవలు కావాలి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వారి కుంటుంబ సభ్యులు కలిపి 15 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ ఆరోగ్య కార్డుల ద్వారా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించుటకు ప్రభుత్వానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మూల వేతనంలో 1 శాతం సొమ్మును చందాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మధ్య ఉద్యోగ సంఘాలు కూడా ప్రకటించాయి. కావున ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరినట్టు ఉద్యోగుల జీతాల నుంచి కొంత శాతం ప్రీమియం రూపంలో వసూలు చేసి, వచ్చిన మొత్తం సొమ్ముకు అంతే మొత్తం సొమ్మును ప్రభుత్వం ఇస్తూ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తే బాగుంటుంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు పరిస్తే ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులు రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించగలుగుతారు. - అంకం నరేష్,కోకన్వీనర్, యూఎఫ్ఆర్టీఐ