8 ఏళ్లుగా తెరుచుకోని ఇన్స్పెక్షన్ గ్యాలరీ
లోపలంతా గ్యాస్ తో నిండిపోయిన దారి
పనిచేయని మూవింగ్ లిఫ్ట్
గతంలో గ్యాలరీ తెరిచేందుకు ప్రయత్నించిన వారికి అస్వస్థత
డ్యామ్ సిపేజీ పై కొరవడిన పర్యవేక్షణ
గద్వాల, వెలుగు: రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న మొదటి ప్రాజెక్ట్ ప్రియదర్శిని జూరాల డ్యామ్ సేఫ్టీని సర్కారు గాలికి వదిలేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. డ్యామ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలిపే ఎక్స్ రేగా ఇన్స్పెక్షన్ గ్యాలరీని భావిస్తుంటారు. కానీ ఈ గ్యాలరీ తలుపులు తెరుచుకోక ఇప్పటికి ఎనిమిదేళ్లు దాటి పోయింది. డ్యామ్ నుంచి వచ్చే సీపేజీల పర్యవేక్షణ కోసం ప్రాజెక్టు ఈ చివర నుంచి ఆ చివరి వరకు తిరిగేందుకు ఏర్పాటుచేసిన మూవింగ్ లిఫ్ట్ కూడా పని చేయడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. ఈ సమస్యను సర్కార్ దృష్టికి తీసుకెళ్లినా అటు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జూరాల ఆఫీసర్లు చెబుతున్నారు.
ఇన్స్పెక్షన్ గ్యాలరీనే కీలకం
ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకైనా ఇన్స్పెక్షన్ గ్యాలరీ ఎక్స్ రే లాంటిది. ఆ గ్యాలరీ ద్వారానే ఇంజినీర్లు డ్యామ్ సీపేజీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ప్రతి వారం రోజులకు ఒకసారి మూవింగ్ లిఫ్ట్ ద్వారా డ్యామ్ కింది భాగాన అటు నుంచి ఇటు తిరిగి పర్యవేక్షిస్తారు. సీపేజీ హోల్స్ ద్వారా ఎలాంటి నీరు
పోతోంది అనేది ప్రధానంగా చెక్ చేస్తారు. పోయేది వండు(బురద)నీరా? ప్లేన్ వాటరా? అనేది కీలకం. ఒకవేళ బురద నీళ్లు పోతుంటే డ్యామ్ ప్రమాదంలో ఉన్నట్లే లెక్క అని ఇంజినీర్లు అంటున్నారు. అదే జరిగితే డ్యామ్ రక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇన్స్పెక్షన్ గ్యాలరీ ద్వారా సీపేజీ హోల్స్ నుంచి కాకుండా ఇతర చోట్ల నుంచి నీళ్లు లీకవుతున్నాయా? డ్యామ్ కు ఎక్కడైనా క్రాక్స్ వచ్చాయా? అనే విషయాలను తెలుసుకొని ఏమాత్రం తేడా వచ్చినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. కానీ జూరాల ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ గ్యాలరీని సుమారు 8 ఏళ్లుగా తెరవడం లేదు.
సర్కారు దృష్టి కి తీసుకెళ్లాం
ఇన్స్పెక్షన్ గ్యాలరీ లోపలికి వెళలేక్ల పోవడం, డ్యామ్ పరిస్థితి పర్యవేక్షించలేకపోవడం జూరాల ప్రాజెక్టు సేఫ్టీకి ఇబ్బందే. గ్యాలరీ ద్వారా డ్యామ్ సేఫ్టీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఎనిమిది ఏండ్లనుంచి ఇన్స్పెక్షన్ గ్యాలరీకి వెళ్లలేకపోయాం. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
గ్యాస్ తో నిండిపోయిందట..
ప్రారంభంలో చాలా ఏండ్లపాటు అప్పటి డ్యామ్ ఇంజినీర్లు ఇన్స్పెక్షన్ గ్యాలరీని తెరవకుండా నిరక్ష్ల్యం చేశారు. కానీ ఎనిమిది ఏండ్ల క్రితం అప్పటి ఇంజనీర్లు గ్యాలరీ డోర్లు తెరిచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా గ్యాస్ బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు, ముగ్గురు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఆక్సిజన్ పెట్టుకొని గ్యాలరీ లోపలికి వెళ్లాలని భావించినా సాధ్యం కాలేదు. ఇప్పటికి చాలా ఏళ్లుగా ఇన్స్పెక్షన్ గ్యాలరీ మూతపడి ఉండడంతో మొత్తం గ్యాస్ తో నిండిపోయి ఉంటుందని ఎక్స్పర్స్ట్ ఊహిస్తున్నారు. ప్రస్తుతం ఆ డోర్ దగ్గరి కి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని, లోపల లైట్లు వెలగడం లేదని, మూవింగ్ లిఫ్టు కూడా పనిచేయడంలేదని చెబుతున్నారు. పైకి డ్యామ్ బాగానే ఉన్నా లోపల అంతా అస్తవ్యస్తంగా ఉందని చెబుతున్న ఇంజినీర్లు సమస్యను సర్కారు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొంటున్నారు.
For More News..