- కొరియర్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నావంటూ మోసం
- మహిళకు సైబర్ చీటర్స్ టోకరా
బషీర్ బాగ్, వెలుగు: కొరియర్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారంటూ సిటీకి చెందిన 44 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసం చేశారు. తొలుత ఆమెకు ముంబై పోలీసుల పేరిట స్కైప్‌లో వీడియో కాల్ చేశారు. తన పేరుతో ముంబై నుంచి ఇరాన్‌కు కొరియర్ వెళ్తోందని.. అందులో ఐదు ఏటీఎం కార్డులు, ఐదు పాస్ పోర్టులు, ల్యాప్ టాప్, రెండు కేజీల బట్టలతోపాటు 450 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్లు వివరించారు. అది తాను పంపిన కొరియర్ కాదని బాధిత మహిళ చెప్పినప్పటికీ వినిపించుకోకుండా మనీలాండరింగ్ కూడా పాల్పడ్డారని, ముంబైలో కేసు నమోదు అయినట్లు బెదిరించారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు మూడు నుంచి ఏడేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. దీంతో భయపడిన బాధితురాలు సైబర్ చీటర్స్ అడిగిన బ్యాంక్ అకౌంట్స్, కుటుంబ సభ్యుల వివరాలను చెప్పింది. అనంతరం కాల్‌ను ఆర్బీఐ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు నమ్మబలికారు. వారు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అడగ్గా, బాధితులు తన అకౌంట్ లో డబ్బులు లేవని తెలిపింది. దీంతో కేసు నుంచి బయటపడాలంటే అకౌంట్లో డబ్బులు ఉండాలని చెప్పారు. బాధితురాలితో రూ.20 లక్షల లోన్ అప్లై చేయించారు. ఆ డబ్బులను తమ అకౌంట్‌కు పంపాలని, వేరిఫై చేసి తిరిగి పంపిస్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన బాధిత మహిళ ఆ డబ్బులను స్కామర్లకు పంపింది. ఆ తర్వాత ఎలాంటి ఫోన్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.