రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు : మంత్రి గంగుల

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు : మంత్రి గంగుల

7,100కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదన

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, కోటి మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యమని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 14కోట్ల గన్నీ బ్యాగులు, పాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లతోపాటు టార్పాలిన్లతో సిద్ధంగా ఉన్నామన్నారు. 7,100కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రాబోయే రెండున్నర నెలల పాటు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ అప్రమత్తంగా ఉంటుందని మినిస్టర్​పేర్కొన్నారు. 

31 నాటికి కేబుల్ బ్రిడ్జి సిద్ధం కావాలి  

కరీంనగర్ సిటీ: డిసెంబర్ 31 నాటికి కరీంనగర్​కేబుల్ బ్రిడ్జిని సిద్ధం చేయాలని, మరుసటి రోజు లైటింగ్ పనులు పూర్తి చేయాలని మంత్రి కమలాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో మున్సిపల్, ఆర్అండ్ బీ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. గీతాభవన్ చౌరస్తా, చొక్కారపు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఐడిల్ లా నగరంలోని పద్మానగర్, కాపువాడ, హెచ్ఆర్ కే, సదాశివపల్లి డౌన్, సదాశివపల్లి టు వరంగల్ రోడ్, సిక్కువాడి తదితరప్రాంతాలలో కొత్తగా ఐడిల్ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి అన్నారు. సమీక్షలో కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, మేయర్ సునీల్ రావు, వైస్ చైర్ పర్సన్ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.