ఎస్సీ, ఎస్టీ, బీసీలు విముక్తి కావాలన్నదే నా జీవితాశయమని ప్రొ.కంచె ఐలయ్య స్పష్టం చేశారు. 'మనతత్వం' పుస్తకం కేసులో కోర్టుకు హాజరైన రచయిత కంచె ఐలయ్య... అంబేద్కర్ 65 ఏళ్లకే చనిపోయాడని, ఆయనకంటే తాను ఇప్పటికే పదేళ్లు ఎక్కువగా బతికానన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడే సమస్యే లేదన్న ఆయన... తాను ఇప్పటికే చాలా కాలం బతికానని చెప్పుకొచ్చారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, తన అక్షర పోరాటం సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. తనను అణచివేయాలనుకుంటే తన కలం బొందలో ఉండి కూడా రాస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను వేలాది మందికి పాఠాలు చెప్పానని, ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం తాను 30 ఏళ్లు పోరాడానని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న డిమాండ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా తిరస్కరించిందన్న ఐలయ్య... ఏపీలో తన పోరాటం ఫలించిన తర్వాత... ఇక్కడ కూడా సర్కారు ఇంగ్లీష్ మీడియం పెట్టక తప్పలేదని తెలిపారు.
కరీంనగర్ అడిషనల్ కోర్టులో బేతి మహేందర్ రెడ్డి అనే అడ్వేకేట్ తాను రాసిన మనతత్వం అనే పుస్తకంపై వేసిన కేసు కోసం ఇక్కడికి వచ్చానని కంచె ఐలయ్య అన్నారు. మనతత్వం అనే పుస్తకం 22 ఏళ్ల క్రితం నేను రాశానన్న ఆయన... మొదట ఓ పత్రికలో 20 వారాల పాటు సీరియల్ గా వచ్చిందని చెప్పారు. ఇప్పటికే అనేక రీ ప్రింటులు వచ్చాయని, ఆనాటి పంచాయతీ వ్యవస్థ, కింది కులాల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పుస్తకం రాశానన్నారు. కోర్టు పరిధిలో కేసు కనుక దీనిపై నేను మాట్లాడదలుచుకోలేదన్న ఐలయ్య... కానీ ప్రజల హక్కులను కాపాడుకునే క్రమంలో వచ్చే రచనలను అడ్డుకుంటే.. ప్రజల సమానత్వం ఆగిపోతుందని చెప్పారు. జ్యుడీషియరీ మీద, న్యాయవాదుల మీద, జడ్జీల మీద తనకు గౌరవం ఉందని తెలిపారు.