- 2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే: మంత్రి ఉత్తమ్
- రాష్ట్ర ప్రజల హక్కులు, ప్రయోజనాలను కాపాడుతాం
- ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు
- కృష్ణా జలాల కేసులపై అడ్వకేట్లు, అధికారులతో సమావేశం
- ట్రిబ్యునల్స్, సుప్రీంకోర్టులో గట్టిగా వాదించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో సగం వాటాకు కట్టుబడి ఉండాల్సిందేనని, ఆ వాటా దక్కే వరకు ట్రిబ్యునల్స్ ముందు గట్టిగా పోరాడుతూనే ఉండాలని అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా 2015లో కృష్ణా జలాల పంపిణీ జరిగిందని, అప్పుడు ఏపీతో జరిగిన ఒప్పందం కేవలం తాత్కాలికమేనని, ఆ ఏడాది వరకు సంబంధించిన వాటాలపైనే జరిగిందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో జనాభా, అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రానికి సగం వాటా వచ్చే వరకు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ2) ముందు వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులపై ఆదివారం ఆయన జలసౌధలో సమావేశం నిర్వహించారు. తెలంగాణ తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ సి.ఎస్. వైద్యనాథన్, రవీందర్ రావు, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఆ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్ డిపార్ట్మెంట్కు చెందిన ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేడబ్ల్యూడీటీ 2, సుప్రీం కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు, వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రికి అడ్వొకేట్ వైద్యనాథన్ వివరించారు.
కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు
ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు (కేఆర్ఎంబీ) అప్పగించే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ మరోసారి తేల్చి చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వబోమన్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 12న అసెంబ్లీలో తీర్మానం కూడా పాస్ చేశామని తెలిపారు. కృష్ణా బేసిన్లో రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలు, నీటి హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదని, ఆ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా, కేడబ్ల్యూడీటీ 2 అవార్డుపై సుప్రీం కోర్టులో కేసు ఇంకా పెండింగ్లోనే ఉందని అడ్వొకేట్ సి.ఎస్. వైద్యనాథన్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిని పరిష్కరించుకునేందుకు మహారాష్ట్ర, కర్నాటకతోనూ ఓసారి చర్చలు జరిపితే బాగుంటుందని సూచించారు. ఈ సూచనకు ఆమోదం తెలిపిన మంత్రి ఉత్తమ్.. ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
న్యాయమైన వాటా దక్కాల్సిందే..
కృష్ణా బేసిన్లోని అంశాలను బట్టి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి న్యాయమైన వాటాలు దక్కకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి కష్టాలను తీర్చేందుకు కచ్చితంగా సగం వాటాను సాధించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనిపై అధికారులు, లీగల్ టీమ్, టెక్నికల్ టీమ్ తమ వంతు ప్రయత్నాలను తీవ్రంగా చేయాలని సూచించారు. ట్రి బ్యునల్, సుప్రీంకోర్టుల్లో రాజీ పడకుండా గట్టిగా పోరాడాలని ఆయన ఆదేశించారు.