
- ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళి
హైదరాబాద్, వెలుగు: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ద్రోహులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మతం పేరు అడిగి మరీ దాడి చేయడాన్ని సభ్య సమాజం ఖండిస్తుందన్నారు. బుధవారం ట్యాంక్ బండ్ పైనున్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పహల్గాంలో చనిపోయిన వారికి కిషన్‌రెడ్డితో పాటు ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పాకిస్తాన్ లో అసమర్థ నాయకత్వం ఉందని, ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో నిప్పులు పోస్తున్నదని చెప్పారు. భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే అది ఆ దేశ పొరపాటేనని ఎద్దేవా చేశారు. దాడి సిగ్గుమాలిన చర్య అన్నారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిని చూడలేక భారత్‌ను పాక్ దొంగదెబ్బ తీస్తున్నదన్నారు. కాశ్మీర్ సంస్కృతిని కాపాడేందుకు మోదీ ప్రభుత్వం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పాక్ కుట్రలో భాగంగానే దాడి జరిగిందని ఆరోపించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... పహల్గాం దాడి పరిణామాలు సీరియస్ గా ఉండాలన్నారు.
పాకిస్తాన్ ది పిరికి పంద చర్య: డీకే అరుణ
పాకిస్తాన్ ది పిరికి పంద చర్య అని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నిరాయుదులైన టూరిస్ట్‌ల మీద దాడి చేయడం దారుణమని డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల రాంచంద్రారెడ్డి, గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు.