- మ్యాచ్‌కు అదనంగా 4 గంటల కేటాయింపు
- టీ20 వరల్డ్ కప్‌లో స్వల్ప మార్పు
దుబాయ్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గయానాలో జూన్ 27న జరిగే రెండో సెమీఫైనల్ రిజర్వ్ డేను ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తొలగించాయి. ఈ మ్యాచ్‌ను అదే రోజు ముగించేందుకు అదనంగా 4 గంటలు (250 నిమిషాలు) కేటాయించాయి. ఒకవేళ రెండో సెమీస్ రిజర్వ్ డేకు వెళ్తే గెలిచిన జట్టు తర్వాతి రోజునే ఫైనల్ ఆడాల్సిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. తొలి సెమీస్‌కు మాత్రం రిజర్వ్ డే ఉంటుందని స్పష్టం చేశాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అన్ని నాకౌట్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డేలు కేటాయించింది.
తాజాగా ఇందులో స్వల్ప మార్పులు చేసింది. ట్రినిడాడ్ వేదికగా జూన్ 26న తొలి సెమీస్ స్థానిక టైమ్ ప్రకారం రాత్రి 8.30 గంటలకు (ఇండియా టైమ్ ప్రకారం తర్వాతి రోజు ఉదయం 6 గంటలు) మొదలవుతుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆ రోజు ఆట రద్దయితే.. తర్వాతి రోజు (జూన్ 27న) రిజర్వ్ డేన ఆడిస్తారు. కానీ, రెండో సెమీఫైనల్ జరిగే గయానాలో టైమ్ జోన్ డిఫరెంట్‌గా ఉంది. జూన్ 27న స్థానిక టైమ్ ప్రకారం ఉదయం 10.30 గంటలకు (ఇండియా టైమ్ రాత్రి 8)ఈ మ్యాచ్ మొదలవుతుంది.
రెండు సెమీఫైనల్స్ విజేతలు జూన్ 28న బార్బడోస్ (ఫైనల్ వేదిక) ప్రయాణించాల్సిన నేపథ్యంలో సెకండ్ సెమీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అదే రోజున ముగించాలని ఐసీసీ నాలుగు గంటల అదనపు సమయం కేటాయించింది. జూన్ 28న ట్రావెల్ డేగా కాగా 29న బార్బడోస్‌లో ఫైనల్ జరుగుతుంది. కాగా, ఇండియా గ్రూప్, సూపర్–8 రౌండ్ దాటితే రెండో సెమీస్‌ను గయానాలో ఆడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా రెండో సెమీఫైనల్ పూర్తిగా రద్దయితే సూపర్8 దశలో ఎక్కువ పాయింట్లు గెలిచిన టీమ్ ఫైనల్ చేరుకుంటుందని ఐసీసీ తెలిపింది.