
కాజీపేటకు మంజూరై చేజారుతున్న రైల్వే ప్రాజెక్టులు
గతంలో కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ కు..
పీవోహెచ్పైనా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం
మరో 1.17 ఎకరాల స్థలం అప్పగింతలోనే జాప్యం
బాట లేక ఆగిన రూ.383 కోట్ల ప్రాజెక్టు
సాకారమైతే వేల మందికి ఉపాధి
హనుమకొండ, వెలుగు : కాజీపేట జంక్షన్ కు మంజూరైన ప్రాజెక్టులపై నిర్లక్ష్యపు నీడ వదలడం లేదు. రాజకీయ చదరంగంలో ఈ జంక్షన్ నలిగిపోతోంది. ఇప్పటికే రెండు కీలక ప్రాజెక్టులు తరలిపోగా.. మరో ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మౌన పాత్ర వహిస్తోంది. 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు కోచ్‌ఫ్యాక్టరీ మంజూరు చేయగా.. అదే ప్రభుత్వం దానిని పంజాబ్ కు తరలించింది. మళ్లీ 2007లో కాంగ్రెస్ గవర్నమెంటే వ్యాగన్ వీల్ వర్క్ షాప్ ను కాజీపేటకు సాంక్షన్ చేయగా.. దీనిని కూడా కర్నాటకుకు తరలించింది. అప్పటి నుంచి కాజీపేట జంక్షన్ పై రాజకీయ రంగు పులుముకుంది.
మూడో ప్రాజెక్టు వచ్చినా..
కాంగ్రెస్ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశంతో కొత్త కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని, ఉన్న ఫ్యాక్టరీలు సరిపోతాయని పేర్కొంది. కాజీపేటకు అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతో 2016లో ప్రధాని మోడీ పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీవోహెచ్) వర్క్‌షాప్ మంజూరు చేశారు. ఈ వర్క్ షాప్ కు 160 ఎకరాలు అవసరమని, ఈ మేరకు స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. దీంతో విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం 159 ఎకరాలు అప్పగించింది. కానీ ప్రాజెక్ట్ ముఖద్వారం(ఎంట్రన్స్) వద్ద 1.17 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ఉంది. అది కూడా రైల్వే శాఖకు అప్పగిస్తేనే వర్క్ షాప్ ఏర్పాటుకు దారి ఉంటుంది. కానీ 1.17 ఎకరాలను సేకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో ఈ ఫ్యాక్టరీ కూడా 2021 నుంచి కలగానే మిగిలింది. తాజాగా రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తావించగా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్తగా కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని స్పష్టం చేయడంతో మళ్లీ రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది.
ఇప్పటికే టెండర్లు ఖరారు..
కాజీపేట లో పీవోహెచ్ వర్క్‌షాప్ కోసం కేంద్రం 2016–17 బడ్జెట్ లో రూ.188 కోట్లు, 2018–19, 2019–20లో రూ.10 కోట్ల చొప్పున మం జూరు చేసింది. కానీ ల్యాండ్ పూర్తి స్థాయిలో అందించకపోవడంతో నిధులు విడుదల కాలేదు. కాగా ఇటీవల ప్రాజెక్టు ల్యాండ్ విషయంలో క్లారిటీ రావడంతో ఇప్పటికే రైల్వేశాఖ టెండర్లు కూడా పిలించింది. హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ రూ.361కోట్లకు టెండర్దక్కించుకోగా.. రైల్ వికాస్‌నిగమ్ లిమిటెడ్వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చింది. దీంతో పనులు పట్టాలెక్కుతాయని అంతా భావించారు. కానీ దారికి కావాల్సిన భూమిని అప్పగించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. కదులుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కొన్ని రాజకీయ కారణాల వల్లే ప్రాజెక్టుకు ముందుకు సాగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అయిదారు వేల మందికి ఉపాధి దక్కనుంది.
లీడర్లు, ఆఫీసర్లు చొరవ తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థలం ఇవ్వకపోవడం వల్లే కాజీపేట రైల్వే పీవోహెచ్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. విడతల వారీగా భూమిని అప్పగించినప్పటికీ పనులు స్టార్ట్ కావడానికి దారి సమస్య ఏర్పడింది. ఇక్కడ ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే ఎంతోమందికి ఉపాధి కలిగే అవకాశం కూడా ఉంది. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రాజెక్టుకు కావాల్సిన దారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్