- 3.78 లక్షల సీడ్ ప్యాకెట్లు అవసరం.. అందుబాటులో 4.05 లక్షల ప్యాకెట్లు
- రైతులు బీటీ 3 సీడ్ సాగు చేసి నష్టపోవద్దు
- నకిలీ సీడ్ కంట్రోల్‌కు పకడ్బందీ చర్యలు
- ‘వెలుగు’తో మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్
మంచిర్యాల, వెలుగు : జిల్లాలో పత్తి విత్తనాలకు కొరత లేదని, అవసరానికి కంటే ఎక్కువే అందుబాటులో ఉన్నాయని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ స్పష్టం చేశారు. రైతులు విత్తనాల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వివిధ కంపెనీలకు చెందిన 130 రకాలకు పైగా విత్తనాలను జిల్లాలోని 295 షాపుల ద్వారా అమ్ముతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతి పొందిన అన్ని వెరైటీలకు ఒకే రకమైన దిగుబడులు వస్తాయని తెలిపిన కలెక్టర్..
కొన్ని వెరైటీలకు అధిక దిగుబడి వస్తుందనే ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. నకిలీ విత్తనాలు సాగు చేసి నష్టపోవద్దని, లైసెన్డ్స్ డీలర్ల దగ్గరే విత్తనాలుకొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలో పత్తి సాగు, విత్తన లభ్యతపై శనివారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు.
1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశాం. మొత్తం 3.78 లక్షల సీడ్ ప్యాకెట్లు అవసరమవుతాయి. కానీ జిల్లాలో 4.05 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి పొందిన వివిధ కంపెనీలకు చెందిన 130 రకాలకుపైగా విత్తనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇప్పటికే 1.46 లక్షల ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు.
అవసరమైతే అదనంగా మరో 50 వేల ప్యాకెట్లు కూడా తెప్పిస్తాం. ప్రభుత్వం 475 గ్రాముల ప్యాకెట్‌ధర రూ.864గా నిర్ణయించింది. ఇంతకంటే ఎక్కువ రేటుకు అమ్మొద్దు. ఎక్కడైనా అధిక ధరలకు అమ్ముతున్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి.
లైసెన్డ్స్లీడర్ల దగ్గరే కొనాలి
రైతులు లైసెన్డ్స్ డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా రిసిప్ట్ తీసుకోవాలి. ఆ విత్తనాలతో పంట నష్టపోతే సంబంధిత కంపెనీ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. గ్రామాల్లో దళారుల దగ్గర నకిలీ విత్తనాలు కొనొద్దు. నకిలీ సీడ్వల్ల పంట నష్టం జరిగినట్లయితే ఎలాంటి పరిహారం రాదు. అధిక దిగుబడి వస్తుంది. ఈ రకం తీసుకోవాలని దళారులు చెప్పే మాయమాటలను నమ్మొద్దు. కొంతమంది మార్కెట్లో నాలుగైదు వెరైటీలకు డిమాండ్ కల్పించి, కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు అమ్ముకునే అవకాశముంది.
దాన్ని కంట్రోల్చేయడానికి అగ్రికల్చర్ ఆఫీసర్లతో షాపులపై నిఘా ఉంచాం. రోజువారీగా అందుబాటులో ఉన్న స్టాక్, సేల్స్ వివరాలను డిస్ప్లే చేయాలని ఆదేశించాం. డిమాండ్ ఉన్న వెరైటీలను పాస్ బుక్, ఆధార్ కార్డుపై అమ్మాలని సూచించాం. ఎవరైనా ఎక్కువ రేట్లకు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం.
నకిలీ సీడ్దందాపై సీరియస్యాక్షన్
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నకిలీ సీడ్ తీసుకొచ్చి రైతులకు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. అధిక దిగుబడి వస్తుందని, గడ్డిమందు కొట్టి కలుపును నివారించవచ్చని నమ్మబలుకుతున్నారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వ అనుమతి లేని బీటీ3తో పాటు నకిలీ సీడ్అమ్మకాలను కంట్రోల్ చేయడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
ప్రతి మండలంలో తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎస్ఐతో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల నకిలీ విత్తనాలను పట్టుకొని కేసులు పెట్టాం. నకిలీ దందా చేసేవారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపుతాం. జిల్లా బార్డర్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నకిలీ దందాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం.
బీటీ3, గ్లైపోసెట్ వాడొద్దు
జిల్లాలోని కొన్ని చోట్ల హెచ్‌టీ (హెర్బిసైడ్టోలరెంట్) సీడ్‌ను బీటీ3, గ్లైసిల్ పేర్లతో అమ్ముతున్నారు. వీటికి ప్రభుత్వ అనుమతి లేదు. గ్లైపోసెట్ అనే గడ్డిమందును సర్కారు బ్యాన్ చేసింది. రైతులు ఈ విత్తనాలను సాగు చేయొద్దు. గ్లైపోసెట్ వాడకం ద్వారా భూసారం క్షీణిస్తుంది. పంటల దిగుబడి తగ్గిపోతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది.