తెలంగాణలో తాగునీటి కొరత లేదు .. పుకార్లు నమ్మొద్దు: సందీప్​ కుమార్​ సుల్తానియా

తెలంగాణలో  తాగునీటి కొరత లేదు ..  పుకార్లు నమ్మొద్దు: సందీప్​ కుమార్​ సుల్తానియా

 

  •     సాగర్​, ఎల్లంపల్లి నుంచి ఎమర్జెన్సీ పంపింగ్​
  •     అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది
  •     కాగ్నా నది పంప్​ హౌస్​ను పరిశీలించిన పంచాయతీరాజ్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ

కొడంగల్ / హైదరాబాద్​, వెలుగు:  రాష్ర్టంలో నీటి కొరత లేదని పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్​ కుమార్​సుల్తానియా స్పష్టం చేశారు. తాగు నీటి కొరత అంటూ వస్తున్న  పుకార్లను  ప్రజలు నమ్మొద్దని కోరారు. తాగు నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినట్టు తెలిపారు. శనివారం ఆయన వికారాబాద్​ జిల్లా తాండూరు సమీపంలోని కాగ్నా నది పంప్​ హౌస్​ను పరిశీలించారు.  అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగు నీటి సమస్య రాకుండా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నదని వెల్లడించారు. ఎక్కడైనా నీటి సమస్య ఎదురైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాగార్జునసాగర్, ఎల్లంపల్లి నుంచి ఎమర్జెన్సీ పంపింగ్​పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో చేతి పంపులు, పైప్​ లైన్లు, విద్యుత్​ రిపేర్లకు నిధులు మంజూరు చేయడమే కాకుండా.. వాటిని సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు అవసరమైన చోట ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. 

పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో నీటి తొట్టిల ఏర్పాటుకు పశుసంవర్థక శాఖ అధికారులను అదేశించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల నిధులతో 19,605 చేతిపంపులు, 14,708 సింగిల్  ఫేస్ , 5 హెచ్ పీ పంపుసెట్లు, 605 మంచినీటి బావులు, 662 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్  రిపేర్లను స్పెషల్ డ్రైవ్  కింద చేపట్టామన్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు 3.54 కోట్ల నిధులను మంజూరు చేయగా.. ఆ నిధులతో 1,044 పంపుసెట్లు, 495 చేతిపంపులకు రిపేర్లు చేయించామని పేర్కొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 23,975 గ్రామాలకు 37,002 ఓహెచ్ఎస్ఆర్ ల ద్వారా ప్రతి ఇంటికి మిషన్  భగీరథ మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరిస్తున్నామని వివరించారు.  కాగ్నా నది ఇన్​టేక్  వెల్  నుంచి కొడంగల్, యాలాల మండలంలోని గ్రామాలకు మంచినీరు 2.5 ఎంఎల్డీ  సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే నీటి స్వచ్ఛతను తెలుసుకోవడానికి ప్రతి గ్రామ పంచాయతీకి క్లోరోస్కోప్ కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. ప్రతి పది రోజులకు ఒకసారి ఓహెచ్ఎస్ఆర్  క్లోరినేషన్  చేసి శుద్ధమైన మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. అనంతరం  పరిగి మండలం రాఘవపూర్ 135 ఎమ్ఎల్డీనీ సందర్శించి ఏఏ గ్రామాలకు తాగునీరు అందుతున్నదో అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.  

వికారాబాద్​ జిల్లాకు 3.54 కోట్లు : కలెక్టర్​ నారాయణరెడ్డి

తాగునీటి అవసరాలను తీర్చేందుకు వికారాబాద్​ జిల్లాకు ప్రభుత్వం రూ.3.54 కోట్ల నిధులు మంజూరు చేసిందని కలెక్టర్​ నారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 495 హ్యాండ్​ పంప్​లు, 1,044 పంప్​ సెట్లకు రిపేర్లు చేసి అందుబాటులో ఉంచామని తెలిపారు. సమావేశంలో అడిషనల్​ కల్టెకర్​ రాహుల్​శర్మ, మిషన్​ భగీరథ ఈఎన్సీ కృపాకర్​రెడ్డి, చీఫ్​ ఇంజినీర్​ చెన్నారెడ్డి, ఎస్ఈ ఆంజనేయులు, జడ్పీ సీఈవో సుధీర్,  డీపీవో జయసుధ, డీఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.