118 జీవో గైడ్​లైన్స్ ఇంకెప్పుడిస్తరు?

118 జీవో గైడ్​లైన్స్ ఇంకెప్పుడిస్తరు?

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని నిషేధిత జాబితాలో ఉన్న భూముల రెగ్యులరైజేషన్ కు అడుగు ముందుకు పడటం లేదు. ప్రభుత్వం 118 జీవో రిలీజ్ చేసి గైడ్​లైన్స్ ఇవ్వడం మరిచిపోయింది. గతేడాది నవంబర్ 2న సరూర్ నగర్ సభలో మంత్రి కేటీఆర్ 118 జీవో రిలీజ్​చేస్తున్నట్లు ప్రకటించారు. నిషేధిత జాబితాలో భూములు ఉన్న వారికి ఇది శుభవార్త అని చెప్పారు. కానీ ఆ తర్వాత జరగాల్సిన ప్రక్రియను పూర్తిచేయలేదు. భూముల రెగ్యులరైజేషన్ కి సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని, వచ్చిన తర్వాతే సర్వేపై క్లారిటీ వచ్చేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఎల్ బీ నగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి, మేడ్చల్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోని 44 కాలనీల్లో నిషేధిత జాబితాలో ఉన్నాయి. 118జీవో రిలీజ్​అయ్యాక సర్వే కోసం 15 వేలకి పైగా అప్లికేషన్లు వచ్చాయి.  వీటిలో ఎల్​బీనగర్ నియోజకవర్గంలోనే 70 శాతం అప్లికేషన్లు ఉన్నాయి. 15 ఏండ్ల తర్వాత పట్టాలు అందుతాయనడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంతవరకు మిగిలిన ప్రక్రియ మొదలు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 

2008 నుంచి ఆగిన ప్రక్రియ

15 ఏండ్లుగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ల కోసం ఈ కాలనీల్లోని జనం ఎదరు చూస్తున్నారు. మొత్తం ఆరు నియోజకవర్గాల పరధిలోని కొన్ని సర్వే నంబర్లను 1998లో 22ఏ (నిషేధిత భూముల) జాబితాలో చేర్చారు. 2008లో ఈ విషయం గుర్తించిన రెవెన్యూ అధికారులు ఈ సర్వే నంబర్లలోని భూముల రిజిస్ట్రేషన్‌‌ ప్రక్రియను నిలిపివేశారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు జరగక భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిషేధిత జాబితాలో ఉన్న వెయ్యి చదరపు గజాలలోపు భూములకు పట్టాలు అందిస్తామని గతేడాది నవంబర్​లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకుగాను ఒక్కో స్క్వేర్ యార్డుకి రూ.250 చెల్లించాల్సి ఉంది. ఇలా ఇండ్ల జాగాని బట్టి మొత్తం ఫీజును ఆరు నెలల్లోపు నాలుగు విడతలుగా చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం జీవో రిలీజ్​చేసిన వెంటనే సదరు సర్వే నంబర్లలోని లబ్ధిదారులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. రెవెన్యూ అధికారుల వెరిఫికేషన్  కోసం వెయిట్ చేస్తున్నారు. సర్వే చేసి తమ స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయించాలని కోరుతున్నారు. 15 ఏండ్లుగా పట్టాల కోసం ఎదురు చూస్తున్నామని, జీవో ఇచ్చి ఆలస్యం చేయడం కరెక్ట్ ​కాదంటున్నారు. 

త్వరగా చేస్తే మంచిది

రెవెన్యూ అధికారులు త్వరగా సర్వే చేసి రిజిస్ట్రేషన్లు చేయాలి. 15 ఏండ్లుగా రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నాం. జీవో వచ్చాక కూడా వెయిట్​చేయాల్సి వస్తోంది. త్వరగా గైడ్ ​లైన్స్​ ఇవ్వాలి.
‑ ప్రవీణ్ ​గౌడ్​, ఎల్​బీనగర్

సీఎస్ మారడంతోనే ఆలస్యం?

సీఎస్​గా సోమేశ్​కుమార్ ఉన్న టైంలో 118 జీవో వచ్చింది. ఆ వెంటనే లబ్ధిదారుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నప్పటికీ ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. దీంతో రెవెన్యూ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 3 నెలలుగా ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాగానే సర్వే చేస్తామని చెబుతూ వస్తున్నారు. గైడ్​లైన్స్​ఎప్పుడు వస్తాయనే సంగతి చెప్పడం లేదు. సోమేశ్ కుమార్​స్థానంలో ఇటీవల శాంతికుమారి బాధ్యతలు తీసుకున్నారు. ఆమె 118జీవోకు సంబంధించిన ఫైల్ ను ఎప్పుడు చూస్తుందో తెలియదు.