ప్రపంచంలో ఎక్కడా ఈ కల్చర్​లేదు

 ప్రపంచంలో ఎక్కడా ఈ కల్చర్​లేదు
  • ఆడబిడ్డల సంతోషమే ప్రభుత్వ లక్ష్యం
  • బతుకమ్మ చీరల పంపిణీలో మినిస్టర్ గంగుల

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రకృతిని పూజించి పండుగ చేసుకుంటారని, అదే బతుకమ్మ పండగ అని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక 16,37,38 డివిజన్లలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి బతుకమ్మ కానుకగా చీరలను అందిస్తోందన్నారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గత పాలకుల హయాంలో బతుకమ్మను వేసేందుకు కూడా నీళ్లు ఉండేవి కావని అన్నారు.

అంబరాన్నంటేలా కళోత్సవాలు

30వ తేదీ నుంచి అక్టోబర్2 వరకు కరీంనగర్ కళోత్సవ సంబరాలు వైభవంగా నిర్వహించుకుందామని  మంత్రి చెప్పారు. స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కళోత్సవ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో మినిస్టర్​ మాట్లాడారు. ఇజ్రాయిల్, మలేషియా, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన కళాకారుల, తెలంగాణతోపాటు దేశంలోని  20 రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం స్థానిక 21వ డివిజన్ లో మేయర్ తో కలిసి రూ.24లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులను మంత్రి ప్రారంభించారు. ప్రాధాన్యత క్రమంలో నగరంలోని అన్ని డివిజన్లను డెవలప్ చేసుకుందామని చెప్పారు. అంతకుముందు స్థానిక షిర్డీ సాయిబాబా టెంపుల్ లో పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ ఆర్వికర్ణన్, అడిషనల్ కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ ఇస్లావత్, డిప్యూటీ మేయర్ స్వరూపారాణి హరిశంకర్, కార్పొటర్లు పాల్గొన్నారు.  

యువత సేవాలాల్ మార్గంలో పయనించాలి

కొత్తపల్లి : యువత సేవాలాల్ మార్గంలో పయనించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సెప్టెంబర్​25,26, 27 తేదీల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ వాల్​పేపర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని లంబాడీలందరికీ ఒకే సంస్కృతి, సంప్రదాయాలు, భాష ఉంటుందని అన్నారు. ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, ఆలయ కమిటీ నిర్వాహకులు భూక్యా తిరుపతినాయక్, శ్రావణ్​నాయక్, శ్రీనివాస్​నాయక్, రవినాయక్ పాల్గొన్నారు. 

బతుకమ్మ చీరల కోసం రెండు గంటల నిరీక్షణ

సుల్తానాబాద్, వెలుగు: బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి తాను వచ్చానని, ప్రజలకు మరింత ఇబ్బంది కలగకుండా సభను త్వరగా ముగిస్తానంటూ మినిస్టర్​కొప్పుల ఈశ్వర్​అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్​వద్ద శుక్రవారం మంత్రి కొప్పుల చేతులమీదుగా మహిళలకు దసరా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు మంత్రి రావాల్సి ఉండగా, గంట ముందుగానే మహిళలు సభాస్థలికి వచ్చారు. సర్పంచ్ సుజాత, కలెక్టర్ డాక్టర్ సంగీత, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సైతం నిర్ణీత సమయానికి వచ్చారు. అయితే మంత్రి ఉదయం 11.30 గంటలకు గ్రామానికి వచ్చారు. దీంతో  సుమారు 200మంది మహిళలకు రెండు గంటల పాటు నిరీక్షణ తప్పలేదు. అనంతరం కార్యక్రమాన్ని  ప్రారంభించిన మినిస్టర్​కొప్పుల ఈశ్వర్ పది నిమిషాల పాటు, నలుగురైదుగురికి చీరల పంపిణీ చేసి వెళ్లిపోయారు. కాగా అభివృద్ధి పనులపై ఏమైనా ప్రకటన చేస్తారని ఆశించిన గ్రామస్తులకు నిరాశే మిగిలింది.