బిల్డింగులున్నా ట్రీట్మెంట్ లేదు..ఎక్విప్​మెంట్​ఉన్నా.. మందులు, సిబ్బంది లేరు

  •      ప్రైవేటు దవాఖాన్లకు పోతున్న రోగులు 

పెద్దపల్లి,వెలుగు: గ్రామీణులకు ప్రభుత్వ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పీహెచ్​సీలలో ఫస్ట్​ఎయిడ్​తప్ప ఎలాంటి ట్రీట్మెంట్ అందడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోసం ప్రభుత్వం పెద్దపెద్ద బిల్డింగ్​లు నిర్మిచినా సరిపడు సిబ్బంది లేరు. చికిత్సలు చేయడానికి పరికరాలు, రోగులకు ఇచ్చేందుకు మందులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 636 రూరల్, 249 అర్బన్​పీహెచ్​సీలు ఉన్నాయి. వైద్యశాఖ గుర్తించని పీహెచ్​సీలు మరో 56 ఉన్నాయి. 

పెద్దపల్లి జిల్లాలో వైద్యవిధాన పరిషత్ పరిధిలో పెద్దపల్లి, గోదావరిఖని, మంథని ప్రధాన  ఆసుపత్రులు ఉండగా, ఇటీవల గోదావరిఖని ప్రధాన ఆసుపత్రిని మెడికల్ కాలేజీలో మెర్జ్​ చేశారు.  జిల్లా వైద్యశాఖ పరిధిలో 15  పీహెచ్​సీలు ఉన్నాయి. అర్బన్ పీహెచ్​సీలు ఆరు ఉండగా అవి మొత్తం గోదావరిఖనిలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రితో పాటు వారంలో 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఐదు ఉన్నాయి. అయినా ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. జిల్లాలో వైద్య విధానపరిషత్, జిల్లా వైద్యశాఖకు సంబంధంలేని కునారం, బేగంపేట, అంతర్గాంలో మూడు ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పదేళ్ల క్రితం దాతల సహకారంతో వీటికి పక్కా భవనాలు కూడా నిర్మించారు. అయినా వీటిని వైద్యశాఖ అడాప్ట్ చేసుకోలేదు. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడంలేదు. మందులు అందడంలేదు. సీజనల్ వ్యాధులతో జనాలు బాధ పడుతుంటే  ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. సబ్ సెంటర్లకు ఎమ్మెల్యే, ఎంపీ నిధుల నుంచి ప్రత్యేకంగా ఫండింగ్ చేసి వసతులు కల్పించే అవకాశం ఉన్నా.. అటువైపు దృష్టిపెట్టడంలేదు. అన్ని హంగులున్నా.. వాటిలో వైద్యమూ అందడంలేదు. స్థానిక పంచాయతీలూ పట్టించుకోవడంలేదు.

డాక్టర్లే సొంత ఖర్చులు పెట్టుకుంటన్నరు

పీహెచ్​సీలలో  సౌకర్యాలు లేకపోయినా డాక్టర్లు సొంత ఖర్చులతో అవసరాలు తీర్చుకుంటున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం కునారం పీహెచ్​సీలో గతంలో నీటి మోటారు చెడిపోయింది. ఆరు నెలలపాటు దానిని ఎవరూ పట్టించుకోలేదు. మండలానికి చెందిన ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో స్థానిక డాక్టరే సొంత డబ్బులతో బోర్ మోటార్ కొనుగోలు చేశారు. ఆసుపత్రి భవనం, మెడికల్ ఎక్విప్​మెంట్​అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగ పడటంలేదని, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవచూపి పీహెచ్​సీలకు కావాల్సిన మందులు, సిబ్బందిని ఏర్పాటు చేయడంలో కృషి చేయాలని ప్రజలు  కోరుతున్నారు. 

పెద్దాసుపత్రికే పంపుతండ్రు

జ్వరం వచ్చిన వారికి జిల్లా ఆసుపత్రికే పంపుతున్నారు. కనీసం మందులు ఇస్తలేరు. పీహెచ్​సీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ సిబ్బంది, మందులు లేవు. ట్రీట్మెంటు లేకపోవడంతో రోగులు కూడా దవఖానకు వస్తలేదు. ఆదివారం సిబ్బంది అందుబాటులో ఉంటలేరు. - కొమురయ్య, కునారం