- సర్కిల్ ఆఫీసులకే పరిమితమవుతున్న ఆఫీసర్లు
- ఖాళీగా దర్శనమిస్తున్న వార్డు ఆఫీసులు
- ఫిర్యాదులు తీసుకుంటున్న ఆపరేటర్లు, వాచ్మెన్లు
- ఎప్పుడు వెళ్లినా ‘సార్లు’ ఫీల్డులో ఉన్నారంటూ సమాధానం
- సమస్య పరిష్కరించకుండానే గ్రీవెన్స్ క్లోజ్
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సక్రమంగా సాగట్లేదు. చాలా మంది అధికారులు వార్డు ఆఫీసులకు రావడం లేదు. సర్కిల్ ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. స్థానిక సమస్యలు చెప్పుకుందామని జనం వార్డు ఆఫీసులకు వెళ్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల వాచ్మెన్లు, ఆపరేటర్లు తప్ప అధికారులెవరూ కనిపించడం లేదు. చేసేదేమీ లేక జనం వారికే ఫిర్యాదు కాపీలు ఇచ్చి వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్లినా అధికారులు ఫీల్డ్‌లో ఉన్నారని సమాధానం ఇస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా 10 విభాగాల అధికారులు వార్డు ఆఫీసుల్లో అందుబాటులో ఉండాల్సి ఉన్నప్పటికీ చాలా చోట్ల ఉండడం లేదు. గతేడాది జులైలో అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం జీహెచ్ఎంసీలో వార్డు పాలనను తీసుకొచ్చింది. బల్దియా పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, ఒక్కోచోట ఒక్కో ఆఫీసును ఏర్పాటు చేసింది. ప్రతి ఆఫీసులో వివిధ విభాగాలకు 10 మంది అధికారులను నియమించింది. స్థానిక సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను రూపొందింది. మొదట్లో మంచిగా నడిచిన ఆఫీసులు ఇప్పుడు ఆఫీసర్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆపరేటర్, వాచ్ మెన్లు మాత్రమే ఉంటున్నారు.
విజిటింగ్ అవర్స్‌లోనూ..
ఒక్కో వార్డు ఆఫీసులో వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంజనీర్, టౌన్ ప్లానర్, ఎంటమాలజిస్ట్, శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్ వైజర్, వాటర్ బోర్డు నుంచి వార్డు అసిస్టెంట్, విద్యుత్ శాఖ నుంచి లైన్ మెన్ లేదా లైన్ ఇన్ స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ అందుబాటులో ఉండాలి. వీళ్లంతా స్థానిక సమస్యలపై ఫోకస్పెట్టాల్సి ఉంటుంది. వార్డు స్థాయిలో వచ్చే తాగునీటి సమస్యలు, సీవరేజ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి సిటిజన్ చార్ట్ ఆధారంగా నిర్ణీత సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. ఉదయం వేళల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పటికీ, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా అందరూ వార్డు ఆఫీసులో ఉండాలి. ఫిర్యాదులను ఎంట్రీ చేసి, సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేయాలి. సమస్యను పరిష్కరించాక వెంటనే ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి. కానీ చాలా మంది ఆఫీసర్లు విజిటింగ్ సమయాల్లోనూ అందుబాటులో ఉండటం లేదు.
సిటిజన్ చార్టర్ ప్రకారం..
ఫిర్యాదులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో వివరిస్తూ వార్డు ఆఫీసులో సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేశారు. చెత్త తరలింపుకు సంబంధించి అయితే ఫిర్యాదు అందిన రోజే పరిష్కరించాల్సి ఉంది. పాట్ హోల్స్పూడ్చేందుకు, మ్యాన్ హోల్స్ మూతల ఏర్పాటు, రోడ్డు పక్కన పోసిన సిల్ట్ తొలగింపుకు, స్ట్రీట్ లైట్ రిపేర్, యాంటీ లార్వా ఆపరేషన్, జంతువులు మరణించాయని వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోపు పరిష్కరించాల్సి ఉంది. డ్రైనేజీలు బ్లాక్, సీ అండ్ డీ(భవన నిర్మాణ వ్యర్థాలు) క్లీనింగ్ కోసం 48 గంటలు, ఫాగింగ్ ఆపరేషన్ అయితే 24 గంటల నుంచి 48 గంటల్లో చేయాల్సి ఉంది. ఫుట్ పాత్ రిపేర్లు అయితే 72గంటలు, పెట్ డాగ్ లైసెన్స్ కోసం వారం, సీనియర్సిటిజన్, దివ్యాంగుల ఐడీ కార్డులను 15 రోజుల్లో ఇవ్వాల్సి ఉంది. పబ్లిక్ టాయిలెట్ల మెయింటెనెన్స్అయితే నెలరోజులు, క్లీనింగ్ అయితే అదే రోజు చేయాల్సి ఉంది. కానీ ఈ విధంగా జరగడం లేదు. కొన్ని పనులు చేయకుండానే చేసినట్లు గ్రీవెన్స్ క్లోజ్ చేస్తున్నారు.