యాదాద్రి జిల్లాలో చెరువులు వెలవెల

యాదాద్రి జిల్లాలో చెరువులు వెలవెల
  • 1011 చెరువుల్లో నిండింది 26
  • వర్షపాతం లోటే.. 
  • 140 చెరువుల్లో  సగానికిపైగా నీరు
  • సగానికి మించిన  చెరువుల్లో చేరని నీరు
  • ఆగిపోస్తున్న బోర్లు..  పుంజుకోని నాట్లు

కొద్దిపాటి నీళ్లతో కన్పిస్తున్న ఈ చెరువు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్​గూడెంలో ఉంది. 36 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు కింద 50 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సీజన్​లో కురిసిన ముసురు వానలకు ఇప్పటివరకు పెద్దగా నీరు 
చేరింది లేదు. 

యాదాద్రి, వెలుగు :యాదాద్రి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకపోవడంతో చెరువుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉంది. లోటు వర్షపాతం కారణంగా చెరువుల్లో నీరు చేరలేదు. భూగర్భ జలాలు పెరగలేదు. దీంతో బోర్లు ఆపి పోస్తున్నాయి. జిల్లాలో బోరుబావులు, బావుల మీద ఆధారపడి సాగు చేస్తున్న రైతులు ఇంకా నాట్లు వేయడం లేదు. 

లోటు వర్షపాతం..


ఆకాశం వైపు చూస్తే కారు మబ్బులు, భారీ వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. తీరా చూస్తే జిల్లాలో చిటపట చినుకులు తప్ప.. ఒక్క భారీ వాన కాదు కదా కనీసం ఓ మోస్తారు వాన కూడా కురవలేదు. గడిచిన పది రోజులుగా ఇదే సీన్. వానాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 254.2 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా, 240 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మోత్కూరు, తుర్కపల్లి, పోచంపల్లి, వలిగొండ, మోటకొండూరు మండలాల్లో మాత్రమే సాధారణ కంటే ఎక్కువగా నమోదైంది. మిగిలిన 12 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్​లో మోత్కూరులో 311.3 మిల్లీ మీటర్లు నమోదు కాగా, చౌటుప్పల్​ మండలంలో 153.7 మిల్లీ మీటర్లు నమోదైంది.  

చెరువుల్లో చేరని నీరు..

ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో కుంటలు సహా 1011 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 51,325 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. అయితే.. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. ఇప్పటివరకు కొన్ని చెరువుల్లో చుక్క నీరు కూడా చేరలేదు. చాలా చెరువులు ఎండిపోగా, సగానికి పైగా చెరువుల్లో 10 నుంచి 25 శాతం నీరు కూడా లేదు. వీటిలో దాదాపు 26 చెరువుల్లో మాత్రమే వంద శాతం నీరు చేరిందని ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ చెరువులు కూడా మూసీ కాల్వల పరిధిలోనివే. మరో 60 చెరువుల్లో 75 శాతానికి పైగా నీరు ఉందని, 80 చెరువుల్లో 50 శాతానికి పైగా నీరు ఉందని ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​  చెబుతుంది. 

వానలు పడకుంటే కష్టమే..

జిల్లాలో మూసీ కాల్వలు తప్ప సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఈ మూసీ పరిధిలో భూదాన్​పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తారు.  జిల్లాలోని అన్ని మండలాల్లో లక్ష బోరుబావులు, బావుల ఆధారంగా రైతులు పంటసాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. వానలు కురవకపోవడంతో వరి నాట్లు ఇంకా ఊపందుకోలేదు. 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అగ్రికల్చర్ ​ఆఫీసర్లు అంచనా వేసినా ఇప్పటివరకు సగం కూడా నాట్లు వేయలేదు. వానలు పడకపోవడంతో నారు ముదిరిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో వానలు పడితే కానీ నాట్లు వేయడం స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.