మిల్లుల్లో వడ్లు లేవు.. పైసలే

మిల్లుల్లో వడ్లు లేవు.. పైసలే
  • 2022- 23 యాసంగి వడ్లు టెండర్ వేసిన సర్కారు
  • యాదాద్రి జిల్లాలో 1.88 లక్షల టన్నులు 
  • వడ్ల స్టాక్​ లేక అమౌంట్ చెల్లించాలని సూచన
  • కాంట్రాక్టర్​కు పైసలు కడుతున్న మిల్లర్లు 
  • ఇప్పటికే రూ.100 కోట్లు చెల్లింపు 

యాదాద్రి, వెలుగు : టెండర్​ వేసిన వడ్లు మిల్లుల్లో సరిపడా స్టాక్​లేదు. దీంతో వడ్లకు సరిపడా డబ్బులు విడతల వారీగా మిల్లర్లు చెల్లిస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి వడ్లకు సంబంధించిన పూర్తి సొమ్ము చెల్లించాల్సి ఉంది. ప్రతి సీజన్​లో రైతుల నుంచి వడ్లను సేకరించిన సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్​కస్టమ్​మిల్లింగ్​రైస్​(సీఎంఆర్​) కోసం మిల్లులకు అప్పగిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే సీజన్లు గడుస్తున్నా సీఎంఆర్​అప్పగించని కొందరు మిల్లర్లు మూడు సీజన్ల వరకు తమ వద్దనే స్టాక్ ఉన్నట్టు చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు వడ్ల స్టాక్​ను అమ్ముకొని ఇతర అవసరాలకు డబ్బు వాడుకుంటున్నారు. సీఎంఆర్​అప్పగించాలని సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్​ఒత్తిడి తెచ్చినా సరైన సమయంలో అప్పగించడం లేదు. దీంతో మిల్లర్లు అప్పగించిన సీఎంఆర్​ పోనూ పెండింగ్​లోని వడ్లను ఈ–-టెండర్​ద్వారా అమ్మడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

యాదాద్రిలో 1.88 లక్షల టన్నులు..

యాసంగి 2022–-23 సీజన్​లో యాదాద్రి జిల్లాలోని 41 సీఎంఆర్​మిల్లులకు 4,11,187 టన్నుల​వడ్లను సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్​అప్పగించింది. ఇందుకు 2,77,428 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. 2023 వానాకాలం సీజన్​కు సంబంధించి 47 మిల్లులకు 2,65,197 టన్నుల వడ్లు అప్పగించారు. 2023-–24 యాసంగి సీజన్​వడ్లు 37 మిల్లులకు 2,70,635 టన్నులు అప్పగించారు. 

అప్పటికీ 2022–-23 యాసంగి సీజన్​సీఎంఆర్​ను మిల్లర్లు అప్పగించలేదు. దీంతో మిల్లుల్లో ఉన్న 2022–-23 యాసంగి సీజన్​ వడ్లను విక్రయించడానికి జనవరి 2024లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ-–టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో భాగంగా యాదాద్రి, నల్గొండ, సిద్దిపేట జిల్లాలోని మిల్లుల్లో పెండింగ్​లో ఉన్న 3 లక్షల టన్నుల వడ్లను క్వింటాల్​కు రూ. 1,991 చొప్పున టెండర్ ద్వారా ఓ సంస్థ ఫిబ్రవరిలో దక్కించుకుంది. ఇందులో 1.88 లక్షల టన్నుల వడ్లు యాదాద్రి జిల్లాకు చెందినవే 
ఉన్నాయి. 

రూ.100 కోట్లు చెల్లించిన మిల్లర్లు..?

మిల్లుల్లో వడ్లు లేకపోవడంతో ఇస్తే వడ్లు ఇవ్వండి లేకుంటే.. డబ్బులు చెల్లించాలని టెండర్ దక్కించుకున్న సంస్థ సూచించినట్టుగా తెలిసింది. టెండర్​దక్కించుకున్న సంస్థ సూచనలతో క్వింటాల్ వడ్లకు రూ.2,200కు పైగా చెల్లించడానికి యాదాద్రి మిల్లర్లు అంగీకరించినట్టు తెలిసింది. జిల్లాలో 1.88 లక్షల టన్నులకు రూ.413.60 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 

అయితే ఇప్పటివరకు పలువురు మిల్లర్లు 45 వేల టన్నుల వడ్లకు సంబంధించి రూ.100 కోట్లను రెండు నుంచి మూడు వాయిదాల్లో చెల్లించినట్టుగా సమాచారం. ఒక్కో మిల్లరు రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకు చెల్లించినట్టుగా తెలుస్తోంది. మిగిలిన 1.43 లక్షల టన్నులకు సంబంధించిన అమౌంట్ రూ.300 కోట్లకు పైగా ఆగస్టు నెలాఖరుకు నాటికి పూర్తిగా చెల్లించాల్సి ఉంది. 

మిల్లుల్లో వడ్లు లేవ్.. 

నిబంధనల ప్రకారం ఈ-–టెండర్​లో వడ్లను దక్కించుకున్న సదరు సంస్థ మిల్లుల నుంచి మూడు నెలల్లో స్టాక్​ను తరలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టెండర్​దక్కించుకున్న సదరు సంస్థ సివిల్ సప్లయ్​ డిపార్ట్​మెంట్​కు కొంత అమౌంట్​చెల్లించి.. రిలీజ్​ఆర్డర్​(ఆర్​వో) తీసుకొని వడ్లను తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో సివిల్​సప్లయ్ డిపార్ట్​మెంట్​కూడా మిల్లుల్లో తనిఖీలు నిర్వహించి మూడు సీజన్లకు సంబంధించి ఉండాల్సిన వడ్ల స్టాక్​లేదని గుర్తించింది. జిల్లాలోని పది మిల్లుల్లోని వడ్ల స్టాక్​లో భారీ తేడాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.