కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ పదవులు, నామినేటెడ్‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఇప్పిస్తున్న ఎమ్మెల్యేలు

నల్గొండ, వెలుగు: ఎన్నికలకు మరో ఏడాది  మాత్రమే ఉండడంతో అసంతృప్తులు, ఆశావాహులను తమ వైపు తిప్పుకునేందుకు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌, నామినేటెడ్‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఇప్పిస్తూ బలమైన ఓటు బ్యాంకు కలిగిన లీడర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ తిప్పన విజయ సింహారెడ్డిని ఇటీవల ఆగ్రో ఇండ్రస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నియమించగా, రెండు రోజుల కింద అదే నియోజకవర్గానికి చెందిన మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ చింతరెడ్డి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డికి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలను కీలకమైన పదవుల్లో నియమించడం వెనుక రాజకీయ కోణం లేకపోలేదని ఆయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిర్యాలగూడలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండడం, ఆ వర్గం ఓటర్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. దీంతో ఇప్పుడు ఇచ్చిన ఈ రెండు పదవులతో రూలింగ్‌‌‌‌‌‌‌‌ పార్టీకి మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు.  తిప్పన విషయంలో మాత్రం పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పలువురు చెబుతున్నారు. నల్గొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక టైంలో పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని, తిప్పన విజయసింహారెడ్డిని పోటీ చేయించింది. ఈ ఇద్దరు ఎన్నికల్లో గెలిచారు. అయితే నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఇచ్చిన హామీ మేరకు జడ్పీచైర్మన్‌‌‌‌‌‌‌‌ పోస్టు కట్టబెట్టారు. అప్పటి నుంచి పార్టీలో, ప్రభుత్వంలో కీలకమైన పోస్టును ఆశిస్తున్న విజయసింహారెడ్డికి తాజాగా కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవి ఇచ్చి ఆ లోటు కూడా పూడ్చారు. ప్రస్తుతం మిర్యాలగూడ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవి ఎస్సీలకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో ఆ వర్గంలోనూ వ్యతిరేకత తగ్గింది. ఇప్పటివరకు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఉన్న రాంచందర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ను మునుగోడు ఎన్నికల టైంలో ట్రైకార్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నియమించారు. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గానికి చెందిన రాంచందర్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ను పదవి సర్దుబాటు చేయడంతో ఎస్టీ ఓటర్లలోనూ అసంతృప్తి లేకుండా హైకమాండ్‌‌‌‌‌‌‌‌ జాగ్రత్త పడింది. 

మిగతా నియోజకవర్గాల్లోనూ...

మిర్యాలగూడెం, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ తరహాలోనే నామినేటెడ్‌‌‌‌‌‌‌‌ పోస్టులు, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ పదవులు ఆశిస్తున్న అసంతృప్తులు, ఆశావాహులు నల్గొండ, నకిరేకల్, కోదాడ, దేవరకొండ, ఆలేరు నియోజకవర్గాల్లోనూ ఉన్నారు. వీరంతా పార్టీలో లేదంటే ప్రభుత్వంలో ఏదో ఒక పదవి తప్పక వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నల్గొండలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పంకజ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, చకిలం అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌‌‌‌‌‌‌‌రావు, కన్మంత శశిధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ వంటి లీడర్లు పార్టీ పిలుపు కోసం వెయిట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అయితే నకిరేకల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పార్టీ హైకమాండ్‌‌‌‌‌‌‌‌కు పెద్ద తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజకీయ భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ఏంటనే దానిపైన సీరియస్‌‌‌‌‌‌‌‌గా చర్చ జరుగుతోంది. సిట్టింగ్‌‌‌‌‌‌‌‌లకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్‌‌‌‌‌‌‌‌ ఆశించే ఆశావాహులు డైలామాలో పడ్డారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న లీడర్లకు ఎలాంటి పదవులు ఇస్తారన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌‌‌‌‌‌‌‌గా మారింది. ఎమ్మెల్సీ సీట్లు కూడా ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశం లేకపోవడంతో సీనియర్లను సర్దుబాటు చేయడం పార్టీకి సవాల్‌‌‌‌‌‌‌‌గా మారింది. ఎన్నికల నాటికి తమకు లైన్‌‌‌‌‌‌‌‌ క్లియర్‌‌‌‌‌‌‌‌ చేయకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఇబ్బందులు తప్పవని కూడా అసంతృప్తులు హె చ్చరిస్తున్నారు.