హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ కార్పొరేటర్లపై జనంలో ఎంత వ్యతిరేకత ఉందన్నది ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా తేలింది. ఈ సిట్టింగ్ లే టీఆర్ఎస్ కొంపముంచారు. ఈ సారి 72 మంది సిట్టింగ్ లకు టీఆర్ఎస్ సీట్లు ఇస్తే అందులో 28 మంది మాత్రమే మళ్లీ గెలిచారు. అంటే దాదాపు 44 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను జనం ఓడగొట్టారు. దీంతో టీఆర్ఎస్ సిట్టింగ్ ల మీద జనాలకు ఏ రేంజ్ లో కోపం ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి 55 స్థానాలకే పరిమితం అయ్యింది. దాదాపు 44 స్థానాలను పొగొట్టుకుంది. ఆ అన్ని స్థానాల్లో సిట్టింగ్ లే ఓడిపోవటం విశేషం. గత ఐదేళ్లలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల పై అవినీతి, భూకబ్జాలు, వసూళ్లు, జనాలకు అందుబాటులో ఉండరన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఓ సంస్థ చేసిన సర్వేలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల పనితీరుపై 90 శాతం జనం అసహనం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి టీఆర్ఎస్ హైకమాండ్ గమనించినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ 72 మంది సిట్టింగ్ లకే సీట్లు ఇచ్చింది. ఇదే టీఆర్ఎస్ కు పెద్ద మైనస్ అయ్యింది. మిగతా 27 సిట్టింగ్ స్థానాల్లో ఇద్దరు కార్పొరేటర్లు వేరే పార్టీలో చేరగా 25 మందికి ఈ సారి టికెట్లు దక్కలేదు. మొత్తం 27 సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్లను మార్చింది. ఈ 27 స్థానాల్లో దాదాపు 20 కి పైగా టీఆర్ఎస్ క్యాండిడేట్లే గెలిచారు. మార్చిన స్థానాల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ల మీద మరింత వ్యతిరేకత ఉండే. ఈ సారి కూడా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇచ్చే ఉంటే అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయేదని ఎనలిస్ట్ లు చెబుతున్నరు. ఇక ఎంఐఎం నుంచి 21 మంది సిట్టింగ్ లు మళ్లీ గెలిచిన్రు. ఆ పార్టీ గతంలో 44 సీట్లు గెలవగా మళ్లీ 44 స్థానాల్లో పట్టు నిలుపుకుంది. వీరిలో 21 మంది సిట్టింగ్ లే గెలవటం విశేషం. బీజేపీ గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లోనే గెలవగా ఇద్దరు సిట్టింగ్ లకు మళ్లీ గెలిచారు. టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ గా ఉండి బీజేపీ లో చేరి తోకల శ్రీనివాస్ రెడ్డి మళ్లీ గెలిచారు. దీంతో మొత్తంగా 53 మంది సిట్టింగ్ లు మళ్లీ బల్దియాలో అడుగుపెట్టనున్నరు.