క్లైమాక్స్ కు టికెట్ ఫైట్!..చివరి ప్రయత్నాల్లో ఆశవహులు 

  •     జలగం వెంకట్రావు చేరికతో బీజేపీలో మారిన సీన్​ 
  •     ఆయనకు టికెట్ కన్ఫామ్​అంటున్న అనుచరులు
  •     కాంగ్రెస్​ క్యాండిడేట్ పై ఇంకా రాని క్లారిటీ 
  •     సిట్టింగ్ ఎంపీని అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్​

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎంపీ టికెట్ల విషయంలో బీఆర్ఎస్​ ఒక అడుగు ముందే ఉండగా, కాంగ్రెస్, బీజేపీ మాత్రం క్యాండిడేట్ల వేటలో ఉన్నాయి. బీఆర్ఎస్​ తరపున సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావును మరోసారి బరిలోకి దించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఆయన పేరును కూడా అనౌన్స్ చేసింది. రెండు జాతీయ పార్టీల తరఫున ఎక్కువ మంది టికెట్ కోసం పోటీ పడుతుండగా

ఇంత వరకు ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. హైదరాబాద్, ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలుస్తూ టికెట్​ కోసం తిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్​లో టికెట్ల పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరికి వారు తగ్గేదేలేదన్నట్టుగా టికెట్ వేటలో ఉన్నారు. మంత్రుల కుటుంబ సభ్యులతోపాటు పార్టీలోని ముఖ్య నాయకులు కూడా టికెట్​ఆశిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరడంతో ఆ పార్టీలో సీన్​ మారిపోయింది. ఇప్పటి వరకు రేసులో ఉన్న లీడర్లు సైడయినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. 

బీజేపీ అభ్యర్థి..!

ఎన్నో ఏండ్లుగా పార్టీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా బీజేపీ ఇక్కడ బలం పుంజుకోలేకపోయింది. కమ్యూనిస్టు పార్టీల ప్రభావం, ఇతర అంశాల కారణంగా ప్రభావం చూపలేకపోయింది. గత ఐదేండ్లలో ఎంతో కొంత పార్టీ పరిస్థితి మెరుగైందని భావిస్తున్న సమయంలో  అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు నిలువునా ముంచింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 21 వేల ఓట్లు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులకు కలిపి 16 వేల ఓట్లు వచ్చాయి. దీంతో సొంత పార్టీ నుంచి టికెట్​ఆశిస్తున్న లీడర్ల కంటే, ప్రజా బలమున్న ఇతర పార్టీల నేతలకే ప్రయారిటీ ఇవ్వాలని కమలం పార్టీ భావించినట్టు తెలుస్తోంది.

దాదాపు ఏడాది కాలంగా ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలపై కాషాయం నేతలు ఫోకస్​పెట్టారు. ఇంతకుముందు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ కాగా, ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రం కొంత పాజిటివ్​గా వర్కవుట్ అయినట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్​ నేతలపై గురి పెట్టిన బీజేపీ, ఆపరేషన్​ ఆకర్ష్​లో కొంత సక్సెస్​ అయ్యింది. ఒకట్రెండు వారాలుగా ఒకరిద్దరు ముఖ్యనేతల పేర్లు ప్రచారంలో వినిపించగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి,  మూడుసార్లు ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా గెలవగా

2014లో కొత్తగూడెం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఖమ్మంలో, 2018, 2023 ఎన్నికల్లో కొత్తగూడెంలో ఓడిపోయారు. అయితే మొన్నటి ఎలక్షన్లలో ఆయన బీఆర్ఎస్​ టికెట్​ఆశించినా ఫలితం దక్కకపోవడంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్​ తరఫున పోటీ చేసి 53 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్​లోకి వచ్చిన ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో అనుచరులున్నారు. ఆయన తండ్రి వెంగళరావు సీఎం హోదాలో ఉన్నప్పుడే ఉమ్మడి జిల్లాకు వివిధ రకాల పరిశ్రమలు, ప్రాజెక్టులు తీసుకొచ్చారు.

దీంతో ఈ ఎన్నికల్లో ఆయనే సరైన అభ్యర్థిగా బీజేపీ భావించినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ టికెట్​కన్ఫామ్​ అయిన తర్వాతనే వెంకట్రావు బీజేపీలో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు టికెట్​ఆశిస్తున్న వారు తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకముందే అభ్యర్థిత్వాన్ని కన్ఫామ్​ చేయించుకునేందుకు గాడ్​ఫాదర్ల ద్వారా ట్రై చేస్తున్నారు. 

మిగిలింది కాంగ్రెస్​ మాత్రమే..!

బీఆర్ఎస్​తమ అభ్యర్థిని అనౌన్స్​చేయగా, బీజేపీలో కూడా పోటీ చేసే అభ్యర్థిపై కొంత క్లారిటీ వచ్చింది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​లో మాత్రమే ఇంకా అభ్యర్థుల ఫిల్టర్​ జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్​, మాజీ ఎంపీ వీహెచ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్ర ప్రసాద్ తోపాటు పలువురు నేతలు టికెట్​ఆశిస్తున్నారు.

వీరిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఇంకా సస్పెన్స్​గానే ఉంది. రీసెంట్ గా పలు నియోజకవర్గాల్లో ఆశవహులు పర్యటిస్తూ, కార్యకర్తలను కలుస్తున్నారు. ఇక వ్యాపారవేత్త రాజేంద్రప్రసాద్​ కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్​మున్షీని కలిసి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేశారు. అయితే, ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయనేది మాత్రం ఇంకా తేలడం లేదు.