
- అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు
- ఫార్మా విలేజ్కు భూములిచ్చేందుకు నిరాకరణ
మెదక్, శివ్వంపేట, వెలుగు : గ్రామాల సమీపంలో కెమికల్ కంపెనీల ఏర్పాటుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కంపెనీల నుంచి వెలువడే కాలుష్యంతో సాగునీటి వనరులైన చెరువులు, కుంటలు కలుషితం అవుతాయని, పంటలు దెబ్బతింటాయని, జల, వాయు కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల నిర్మాణంలో ఉన్న కెమికల్ కంపెనీల పనులు ఆపివేయించాలని, కొత్తగా ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
మాసాయిపేట, చేగుంట మండలాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు ఇవ్వమని ఆయా గ్రామాల రైతులు తేల్చి చెబుతున్నారు. శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి గ్రామ శివారులో కొత్తగా ఓ కంపెనీ నిర్మిస్తున్నారు. గతంలో అక్కడ స్టీల్కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు కెమికల్ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రామ పరిధిలో ఉన్న కంకర క్రషర్లు, బ్రిక్స్ తయారీ కంపెనీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని
కొత్తగా మరో కెమికల్ కంపెనీ ఏర్పాటైతే ఇబ్బందులు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కెమికల్ కంపెనీ పనులు ఆపాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. కంపెనీ నిర్మాణాన్నివ్యతిరేకిస్తూ స్థానిక జీపీ ఎదుట ధర్నా చేశారు. కంపెనీ పనులు వెంటనే ఆపకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఫార్మా విలేజ్కు భూములివ్వం
మాసాయిపేట మండలంలోని రామంతపూర్, హకీంపేట్, అచ్చంపేట, చేగుంట మండలం కొండాపూర్గ్రామ శివారులో ఫార్మా విలేజ్ఏర్పాటు కోసం అవసరమైన భూమిని గుర్తించేందుకు ఇటీవల అడిషనల్కలెక్టర్వెంకటేశ్వర్లు, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, టీఎస్ఐఐసీ అధికారులు వెళ్లగా ఆయా గ్రామాల రైతులు అభ్యంతరం తెలిపారు. గతంలో ప్రభుత్వం తమ బతుకు దెరువుకోసం అసైన్మెంట్ భూములు ఇవ్వగా చదును చేసుకుని
బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటున్నామని, ఇపుడు ఆ భూములు తీసుకుంటే తామెలా బతకాలని ప్రశ్నించారు. అంతేగాక ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే అందులోనుంచి వెలువడే కాలుష్య జలాలు, రసాయన వ్యర్థాల వల్ల ఆరోగ్యాలు, పంట పొలాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఫార్మాసిటీకి భూములిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
పంటలు నాశనమైతయ్
మా గ్రామంలో ఉన్న సిమెంట్ బ్రిక్స్ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన భరించలేకున్నాం. ఇప్పుడు కొత్తగా కెమికల్ ఫ్యాక్టరీ కడితే కాలుష్యం సమస్య మరింత ఎక్కువైతుంది. కంపెనీ నుంచి వచ్చే కలుషిత నీటితో పంటలు దెబ్బతినడంతో పాటు, భూములు సాగుకు పనికి రాకుండా పోతాయి. దీంతో రైతుల పరిస్థితి ఆగమైతది. అందుకనే ఊరి దగ్గర కెమికల్కంపెనీ వద్దంటున్నాం.
బాలయ్య, మాజీ సర్పంచ్, ఉసిరికపల్లి
క్రషర్లతోనే ఇబ్బంది పడుతున్నాం
మా గ్రామంలో ఇప్పటికే రెండు పెద్ద స్టోన్ క్రషర్లు ఉన్నాయి. వాళ్లు బండలు బ్లాస్టింగ్ చేస్తుండడంతో వ్యవసాయ బోర్లు కూలిపోతున్నాయి. ఇండ్ల గోడలు బీటలు వారుతున్నాయి. బారీ బ్లాస్టింగ్శబ్దాలకు నిద్ర పట్టడం లేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ కెమికల్ కంపెనీ ఏర్పాటు చేస్తే ఊరు మొత్తం నాశనమవుతుంది. కొత్తగా నిర్మిస్తున్న కంపెనీ పక్కనే కుంటలు, చెరువులు ఉన్నాయి. కంపెనీ నుంచి వచ్చే కెమికల్నీళ్లు చెరువులోకి వెళ్లి నీరు కలుషితం అవుతుంది. అందువల్ల కెమికల్ కంపెనీ నిర్మాణం ఆపేయాలి.
కృష్ణారావు, ఉసిరికపల్లి, శివ్వంపేట మండలం