
- భార్యాభర్తల నడుమ టికెట్ ఫైట్
- మంచిర్యాల కాంగ్రెస్ టికెట్ కోసం ప్రేమ్‌సాగర్ రావు ప్రయత్నం
- ఆయన భార్య, డీసీసీ చైర్ పర్సన్ సురేఖ వైపు హైకమాండ్ మొగ్గు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల కాంగ్రెస్ టికెట్ భార్యాభర్తల్లో ఎవరికి దక్కుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు (పీఎస్సార్) ముందునుంచీ టికెట్తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. గత ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన ఆయన ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే పార్టీ మాత్రం పీఎస్సార్ భార్య, డీసీసీ చైర్ పర్సన్ కొక్కిరాల సురేఖ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ సర్వేలో ప్రేమ్ సాగర్ రావు కంటే సురేఖకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు తేలిందని సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ సూచనప్రాయంగా చెప్పిందని, దానిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో పీఎస్సార్ హవా నడిచింది. అప్పటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగాన్నీ కంట్రోల్ చేశారు. చాలా దూకు డుగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో కొన్ని దందాలు నడిపారనే ఆరోపణలూ ఉన్నాయి. తన తండ్రి కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ఆధ్వర్యంలో కొన్నేండ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఆశించిన మైలేజీ రాలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పీఎస్సార్సతీమణి సురేఖ రెండోసారి డీసీసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఇంటింటికీ కాం గ్రెస్ పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్య టిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటు న్నారు. ఈ నేపథ్యంలోనే సురేఖను బరిలోకి దించితే ఫలితం ఉంటుందని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే మంచిర్యాల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొంటున్నారు.
పీసీసీ చీఫ్‌తో పడట్లేదా?
ప్రేమ్‌సాగర్‌రావుకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో విభే దాలున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్‌కు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో బహి రంగం గానే ప్రేమ్‌సాగర్‌రావు నిరసన తెలిపారు. భట్టి విక్రమార్క వర్గీయుడనే ముద్ర ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో మైనస్‌గా మారుతున్నాయని అంటు న్నారు.