
- పరకాల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు
పరకాల, వెలుగు : హనుమకొండ జిల్లా పరకాలలోని నామినేషన్ సెంటర్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల గడువు ముగుస్తుండడం, ముహూర్తం బాగుందనే ఉద్దేశంతో గురువారం పరకాల నియోజకవర్గ స్థానానికి నామినేషన్ వేసేందుకు రెండు పార్టీల అభ్యర్థులు రెడీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉదయం 11 గంటలకు నామినేషన్ సెంటర్‌కు చేరుకున్నారు. కార్యకర్తలంతా బయటే ఉండగా.. ఆయన మరికొందరు నేతలతో కలిసి నామినేషన్ వేసేందుకు లోపలికి వెళ్లారు.
కొద్దిసేపటికి బీఆర్ఎస్అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కూడా తన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నామినేషన్ వేసేందుకు కేంద్రానికి వచ్చారు. రెండు వర్గాల కార్యకర్తలు తమ పార్టీల పేరుతో పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. అలర్టయిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను పరకాల వైపు, కాంగ్రెస్ కార్యకర్తలను హనుమకొండ రోడ్డు వైపు ఉండాలని సూచించి, అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.