హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేయడంపై మండిపడ్డ బీజేపీ కార్పొరేటర్లు... కౌన్సిల్ లోనే బైఠాయించి.. నిరసన తెలిపారు. దాదాపు 8 గంటలుగా కౌన్సిల్ లోనే బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.
కౌన్సిల్ లోకి ప్రవేశించిన పోలీసులు.. బీజేపీ కార్పొరేటర్లను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. కార్పొరేటర్లను బలవంతంగా మార్షల్స్ బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్పొరేటర్లకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువర్గాల తోపులాటలో మహిళా కార్పొరేటర్లకు గాయాలయ్యాయి.
కరెంట్ కట్ చేసి బీజేపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు. వాటర్ బోర్డు అధికారుల బాయ్ కాట్ తో కౌన్సిల్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. అధికారులు బాయ్ కాట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
కార్పొరేటర్ల ను బీజేపీ ఆఫీస్ సమీపంలో వదిలిపెట్టమని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆదేశించారని తెలుస్తోంది. మొత్తానికి తీవ్ర ఉద్రిక్తత మధ్యే కార్పొరేటర్లను బయటకు లాక్కెళ్లడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.