నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివారులోని లచ్చిరాం తండా భూ వివాదంలో చనిపోయిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాధితుల కథనం ప్రకారం.. తండాలోని 200 సర్వే నంబర్ లో కొన్నేండ్లుగా భూ వివాదం నడుస్తోంది. రెండు నెలల కింద జరిగిన భూ వివాదంలో పోలీసులు నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఆరేండ్ల కింద చనిపోయిన పాతులోతు విఠల్ ను రెండు నెలల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ4 గా చేర్చి ఎంక్వైరీకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు.
పూర్తి వివరాలు తెలుసుకోకుండా చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ పేరుతో భయపెట్టడం సరైంది కాదని మృతుడి కుటుంబీకులు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి ఫొటో, డెత్ సర్టిఫికెట్ చూపిస్తూ పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేయకుండా ప్రత్యర్థులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా, కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్ఐ లింగం చెప్పారు. ఎంక్వైరీకి వెళ్లగా విఠల్ చనిపోయిన విషయం తెలిసిందని, అతడి డెత్ సర్టిఫికెట్ సేకరించినట్లు తెలిపారు.