కామారెడ్డి రిజల్ట్ పై ..అంతటా ఆసక్తి.. టఫ్​ఫైట్​లో గెలుపెవరిదో?

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి ఓటర్లు ఇచ్చే తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నియోజకవర్గంపై ఇంత ఆసక్తికి గల ప్రధాన కారణం ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్, పీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డి పోటీపడటం. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా వీరిద్దరికి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో త్రిముఖ పోరులో ఎవరు బయటపడతారోననే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయా పార్టీల నేతలు మాత్రం తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఇక్కడ 39 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కేసీఆర్​ పోటీ చేస్తున్న దృష్ట్యా తమ సమస్యలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పలువురు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాల తరఫున, పౌల్ట్రీ రైతుల తరఫున ఇలా పలువురు బరిలో ఉన్నారు.

ప్రచారానికి అగ్రనేతలు..

కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం చేయడానికి ఆయా పార్టీల అగ్రనేతలు వచ్చారు. బీజేపీ అభ్యర్థి తరఫున నిర్వహించిన ప్రచార సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. కాంగ్రెస్​అగ్రనేత రాహుల్​గాంధీ, బీఆర్ఎస్​అధినేత  కేసీఆర్​ఆయా సభల్లో పాల్గొన్నారు. వీరే కాకుండా అభ్యర్థిగా ఉన్న రేవంత్​రెడ్డి ఆయా మండలాల్లో రోడ్​షోలు, కార్నర్​మీటింగ్​లలో పాల్గొన్నారు. 

బీఆర్ఎస్​తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​కేటీఆర్​పలుమార్లు ప్రచారానికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ షూరూ అయినప్పటి నుంచే ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై వివిధ ఊహాగానాలు ప్రచారమయ్యాయి. పొలిటికల్,  బిజినెస్, మీడియా సర్కిల్, యువతతో పాటు, ఆయా జిల్లాల్లో ఎక్కడ నలుగురు వ్యక్తులు కలిసినా కామారెడ్డి తీర్పుపై  చర్చిస్తున్నారు. కామారెడ్డిలో తమకెవరైనా తెలిసిన వారుంటే వాళ్లకు ఫోన్​చేసి రిజల్ట్​పై ఆరా తీస్తున్నారు.

తగ్గిన పోలింగ్​ శాతం..

సీఎం కేసీఆర్​పోటీ చేసినా కామారెడ్డి నియోజకవర్గంలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 2.66 శాతం ఓటింగ్​తగ్గింది. నియోజకవర్గంలో 2,52,460 మంది ఓటర్లుండగా1,22,019 మంది పురుషులు, 1,30,417 మహిళలు ఉన్నారు. వీరిలో  89,936 మంది పురుషులు,1,00,866 మహిళలు ఓటేశారు. 25 మంది ఇతరులు ఉండగా వారిలో  9 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 75.58  శాతం పోలింగ్​నమోదైంది. 5 ఏండ్ల కిందటి కంటే ఈ సారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా పోలింగ్​శాతం తగ్గింది. 2018లో 2,05,686 మంది ఓటర్లకు గాను 1,60,925 మంది ఓటేశారు. ఓటింగ్​శాతం 78.24 గా నమోదైంది. ఓటింగ్​శాతం తగ్గడం ఎవరికి అనుకూలంగా మారనుంది, ఫలితాలపై ఏ మేర ప్రభావం పడనుందనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.