- రాష్ట్ర దర్శక నిర్మాతలు, సినీ నటులకు ప్రోత్సాహం శూన్యం
- యాసకు దక్కిన ఆదరణ.. కళాకారులకు ఏది?
- బీఆర్ఎస్ హయాంలో మాటలకే పరిమితమైన ప్రత్యేక పాలసీ
- రాచకొండలో ఫిల్మ్‌సిటీ, సింహా పురస్కారాలూ ఉత్తమాటే
- పేరుకే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
- మన దర్శకులు, నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు
- గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని, కొత్త పాలసీ తెస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన
- ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టడీ.. త్వరలోనే కొత్త పాలసీ
హైదరాబాద్, వెలుగు: 1980లలో ‘మా భూమి’, ‘దాసి’ లాంటి గొప్పచిత్రాలతో బెంగాలీ సినిమాకు దీటుగా ఎదుగుతుందనుకున్న తెలంగాణ సినీ పరిశ్రమ.. ఉమ్మడి ఏపీలో తీవ్ర వివక్షకు గురైంది. పోనీ తెలంగాణ వచ్చాకైనా పరిస్థితి మారుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. కేవలం హీరో క్యారెక్టర్లకు తెలంగాణ యాస వచ్చింది గానీ.. ఇక్కడి నిర్మాతలు, దర్శకులు, కళాకారులకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం పాలసీ తెస్తామని, ప్రతిభ ఉన్న కళాకారులు, దర్శక నిర్మాతలను ప్రోత్సహిస్తామని, నంది అవార్డుల స్థానంలో సింహా పురస్కారాలు అందజేస్తామని, రాచకొండ గుట్టల్లో ఫిల్మ్‌సిటీ కడ్తామని.. నాటి సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అయ్యాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా.. ఏ ఒక్కరికీ పైసా ఆర్థిక సాయం చేయలేదు. పదేండ్లలో ఏ చిన్న నిర్మాతనూ ప్రోత్సహించలేదు. ఫలితంగా తెలంగాణలోని దర్శకులు, కళాకారులు ఏపీ నిర్మాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సినీ రంగం అభివృద్ధికి కొత్త పాలసీ తెస్తామని, గద్దర్పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌పై తెలంగాణ సినీ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందుతాయని, తద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ప్రతిబింబించేలా మరిన్ని సినిమాలు తీసే అవకాశం లభిస్తుందని డైరెక్టర్లు, నిర్మాతలు భావించారు. అదే జరిగితే తమకు అవకాశాలు దక్కుతాయని తెలంగాణ ఆర్టిస్టులూ ఆశ పడ్డారు. కానీ పదేండ్లలో ఏ ఒక్క నిర్మాతను గానీ, డైరెక్టర్‌ను గానీ గత బీఆర్ఎస్ సర్కార్ ప్రోత్సహించిన దాఖలాలు లేవు. తెలంగాణ సినీ రంగ అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తెస్తామని అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ప్రకటించిన బీఆర్ఎస్.. దాన్ని అమలు మాత్రం చేయలేదు. పేరుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్ డీసీ) ఏర్పాటు చేసి, రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించి.. చివరికి ఫండ్స్ రిలీజ్ చేయలేదు. తెలంగాణ సినిమాలకు ఆర్థిక సాయం మాట దేవుడెరుగు.. అడపాదడపా వచ్చిన సినిమాలకు కనీసం థియేటర్లు కూడా ఇప్పించకపోవడంతో చిన్న నిర్మాతలు లోలోపలే కుమిలిపోయారు. టీజీఎఫ్డీసీ సభ్యత్వం పొందిన 120 మందిలో 50 మంది వరకు ఏపీ వాళ్లే ఉండడంతో కార్పొరేషన్ లో వాళ్ల పెత్తనమే నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరు రూ.30 వేల చొప్పున చెల్లించి సభ్యత్వం తీసుకోగా.. వారిలో 10- నుంచి15 మందికి మినహా ఎవరికీ ఎలాంటి అవకాశం రాలేదు. చాన్స్ వచ్చిన వాళ్లు కూడా ఏపీకి చెందిన వాళ్లేనని తెలిసింది. ఏపీకి చెందిన పలువురు స్టార్‌హీరోల చిత్రాలకు కోరిందే తడువు టికెట్ల రేట్ల పెంపునకు చకచకా పర్మిషన్లు ఇచ్చిన నాటి సర్కార్.. తెలంగాణ సినీ కార్మికుల సంక్షేమానికి అవసరమైన ప్రతిపాదనలను మాత్రం బుట్టదాఖలు చేసిందనే విమర్శలు ఉన్నాయి.
మనోళ్లకు అపాయింట్మెంట్ కూడా దక్కలే..
బీఆర్ఎస్హయాంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ పని చేసినా.. బడా నిర్మాతలు, పేరున్న దర్శకులు, నటీనటులతో అప్పటి మంత్రి కేటీఆర్సన్నిహితంగా మెలిగేవారు. అడపాదడపా పెద్ద సినిమాల ఆడియో, ప్రీ రిలీజ్ఫంక్షన్లకు హాజరయ్యేవారు. కానీ తెలంగాణ నిర్మాతలు, దర్శకులు, నటీనటులకు కాస్త సమయం కూడా ఇచ్చేవారు కాదని అప్పట్లో చర్చ జరిగింది. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1980లలో ‘మా భూమి’, ‘దాసి’ లాంటి గొప్పచిత్రాలు తీసిన దర్శకుడు బి.నర్సింగారావుకు అప్పట్లో కేటీఆర్అపాయింట్మెంట్ఇవ్వకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. రెండు, మూడుసార్లు ప్రయత్నించి విఫలమైన ఆయన.. మీడియా సమావేశం పెట్టి మరీ తన ఆవేదన చెప్పారు. తెలంగాణ ఉద్యమకాలంలో హీరోగా గుర్తింపు పొందిన ఓ నటుడు మొదట్లో బీఆర్ఎస్ను తెగ అభిమానించేవారు. ఉద్యమ వేదికలపైనా ప్రత్యక్షమై జై తెలంగాణ నినాదాలు చేసేవారు. కానీ బీఆర్ఎస్అధికారంలోకి వచ్చాక ఆయనకు ప్రభుత్వ పెద్దలు కనీసం అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వకపోవడంతో క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.
త్వరలో ప్రత్యేక పాలసీ..
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తూ టీఎస్ స్థానంలో టీజీ తేవడం, ‘జయజయహే తెలంగాణను’ రాష్ట్ర గీతంగా ప్రకటించడం లాంటి నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ సినీ రంగం ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సినీరంగ అభివృద్ధి కోసం త్వరలోనే ప్రత్యేక పాలసీ తీసుకురానున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రస్తుతం తెలుగు సినిమాకు కేరాఫ్అడ్రస్గా ఉన్న హైదరాబాద్‌లో ఫిల్మ్ఇండస్ట్రీ మొత్తం ఏపీ వాళ్ల చేతుల్లోనే ఉంది. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణకు చెందిన దర్శకులు, కళాకారులు, చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. ఇందుకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే స్టడీ చేయించింది. ఔత్సాహిక సినీ కళాకారులు, దర్శక, నిర్మాతలను ప్రోత్సహించేందుకు కర్నాటక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్రూ.35 లక్షల సబ్సిడీ ఇస్తున్నది. యూపీ ఎఫ్డీసీ రూ. కోటి ఇస్తుండగా, మహారాష్ట్ర ఎఫ్డీసీ రూ.50 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలకు, కళాకారులకు, డైరెక్టర్లకు, రైటర్లకు తెలంగాణ ఎఫ్డీసీ నుంచి రూ.50 లక్షల చొప్పున సబ్సిడీ ఇవ్వాలని, మొదటి దఫాలో కనీసం 30 సినిమాలకు రూ.15 కోట్లు కేటాయించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది.
అవార్డులకు అతీగతీ లేదు..
సినీ కళాకారులను ప్రోత్సహించేందుకు ఉమ్మడి ఏపీలో నంది అవార్డులు ఉండగా.. వాటి స్థానంలో సింహా పురస్కారాలు ఇవ్వాలని 2016లో నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉత్తమ చిత్రాలకు రూ.5 లక్షల చొప్పున నగదు పారితోషికం, ఉత్తమ దర్శకుడు, హీరో, హీరోయిన్లకు స్వర్ణ సింహాలు, రూ.లక్ష చొప్పున నగదు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి పేరు మీద రూ.50 వేలు, స్వర్ణ సింహం లాంటి పురస్కారాలు ఇస్తామని ప్రకటించింది. కానీ అధికారంలో ఉన్న ఎనిమిదేండ్లలో ఒక్కసారి కూడా సింహా పురస్కారాలు ఇవ్వలేదు. ఇక రాచకొండ గుట్టలు కేంద్రంగా మరో ఫిలింసిటీని ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పలుమార్లు ప్రకటించినా అవి వట్టి మాటలు గానే మిగిలాయి.