ఒంటరితనం... దీనివల్ల జీవితంలో ఏదో ఒక దశలో బాధపడని వాళ్లు ఉండరు. కొన్ని నెలల పాటు కుటుంబానికి దూరంగా జాబ్ చేయడం, జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేకపోవడం, కొత్త సిటీకి షిఫ్ట్ అవడం, లాంగ్ రిలేషన్షిప్ బ్రేక్ కావడం... ఇలా మనిషిని ఒంటరితనం పలకరించడానికి కారణాలు అనేకం. ఒంటరితనం బారిన పడిన వాళ్లకు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా తాము ఒంటరి అనే భావన వెన్నంటి ఉంటుంది.
‘‘అయితే ఒంటరితనం అంటే ఒక్కరు ఉండడం కాదు. సన్నిహితులు లేరనే భావన. ఉదాహరణకు... సోషల్ మీడియాలో గుంపులు గుంపులుగా ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఎప్పుడు చూసినా వాళ్లతో చాటింగ్ చేస్తుండొచ్చు. కానీ మనసులోని విషయాలను పంచుకోవాల్సి వస్తే మాత్రం వాళ్లెవరూ మీ ప్రియారిటీ లిస్ట్‌లో ఉండరు” అని చెప్తున్నారు మనసు డాక్టర్లు.
ఒంటరితనం అనేది ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. అలాగని దాని గురించి ఏం చేయలేమా? అంటే ఎందుకు చేయలేం. దాన్నుంచి బయటపడేందుకు బోలెడు మార్గాలు, పద్ధతులు ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అవి ఫాలో అయితే చుట్టూ ఉన్న వాళ్లతో కొంచెమైనా కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. లేదా మీతో మీరైనా కనెక్ట్ కావచ్చు.
ఆ విషయాన్ని గుర్తించాలి
ఈ మధ్య కాలంలో ఒంటరితనం గురించి బయటకు చెప్పే కల్చర్ కనపడుతోంది. కాకపోతే ఇప్పటికీ కొందరు మాత్రం అలా చెప్పుకోవడాన్ని ‘తప్పు’గానే చూస్తున్నారు. ఒంటరిగా ఫీలవుతున్నామనే విషయం బయటకు తెలిస్తే ‘ఎమోషనల్‌గా వీక్ లేదా ఒక్క ఫ్రెండ్ కూడా లేని వ్యక్తి’ అని ముద్ర వేస్తారేమో అనుకుంటారు. అలాగని బయటకు చెప్పకుండా ఉంటే... ఒంటరి భావన ఏ రకంగా కూడా మీకు సాయపడదు.
అందుకని మీ ఫీలింగ్ గురించి ఒక పుస్తకంలో రాయడం, అమ్మానాన్న లేదా జీవిత భాగస్వామితో మాట్లాడడం వల్ల ఒంటరి భావన కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఒంటరితనం నుంచి బయటపడేందుకు వేసే మొదటి స్టెప్ ఇది. ఎవర్ని వాళ్లు విమర్శించుకోకుండా లేదా సిగ్గుపడకుండా ఒంటరితనం ఫీలవుతున్నారని తెలుసుకుంటే... ఆ తరువాత దాని గురించి ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది.
ప్లాన్ చేయాలి
ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు, డిస్ప్లే మెసేజ్‌లు పెట్టే టైంను మనసుకు నచ్చిన వ్యక్తితో స్పెండ్ చేయగలిగితే మంచి జ్ఞాపకాలు మిగులుతాయి. ఇలా చేయడం వల్ల ఫోన్ చేసి మాట్లాడినా లేదా మెసేజ్ చేసినా వచ్చే రిజల్ట్ కంటే తప్పకుండా వేరుగా ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అందుబాటు దూరంలో లేకపోతే పాత రూమ్మేట్తో రిలేషన్ పెంచుకునేందుకు ట్రై చేయొచ్చు. లేదా కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
అయితే ఏ వ్యక్తిని కలిస్తే మనసు తేలికపడుతుంది అనిపిస్తుందో వాళ్లని కలిసి టైం ఎలా స్పెండ్ చేయాలి అనుకుంటున్నారో ముందే ప్లాన్ చేసుకోవాలి. వాళ్లతో కలిసి కాఫీ తాగడం. డిన్నర్‌కి వెళ్లడం. సినిమా చూడడం.. ఇలా ప్లాన్ చేసుకోవాలి. తరువాత ‘నేను నిన్ను కలవాలి అనుకుంటున్నా’ అనే మెసేజ్ పంపాలి. ఇలా ప్లాన్ చేయడం వల్ల టైం వేస్ట్ కాకుండా మీకు కావాల్సింది దొరుకుతుంది.
దూరంలో ఉంటే...
దూరప్రాంతంలో ఉన్న వాళ్లతో మాట్లాడాలంటే ఫేస్‌టైం లేదా ఫోన్ కాల్స్ చేయాలి. అలాగని అకస్మాత్తుగా ఫోన్ కాల్ చేసి మాట్లాడమన్నా, చాట్ చేయమని అవతలి వ్యక్తులకు వీలుకాకపోవచ్చు. అందుకని దూరంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడేందుకు ఒక టైంటేబుల్ పెట్టుకోవాలి. ఉదాహరణకి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు మాట్లాడుకుందాం అనే మెసేజ్ ఒకటి లేదా రెండు రోజుల ముందు పెట్టాలి.
ఇలా మెసేజ్ చేయడం వల్ల అవతలి వ్యక్తి వాళ్ల టైం ఇచ్చేందుకు సిద్ధమవుతారు. ఇలా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడడం అనే టెక్నిక్ ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు చాలా బాగా పనిచేస్తుంది.
మనసుకు నచ్చినవి...
మనసు ఇష్టపడే జాగింగ్, పెయింటింగ్, బుక్ రీడింగ్ వంటివి చేస్తే బాగా పనిచేస్తాయి. రన్నింగ్ క్లబ్లో లేదా వారానికి ఒక ఆర్ట్ క్లాస్‌లో చేరినా.. అక్కడికి వెళ్లిన ప్రతిసారి వచ్చే మనుషులు అలవాటవుతారు. వాళ్లకి ఎవరికో ఒకరికి మీలాంటి అభిరుచులే ఉండొచ్చు. మంచి ఫ్రెండ్ దొరికే అవకాశం ఉంది. కుకింగ్ ఇష్టమైతే నలుగురితో కలిసి చేయొచ్చు. పుస్తకాలు చదవడం నచ్చితే బుక్ క్లబ్లో చేరొచ్చు. ఇలా ఒకే మైండ్ సెట్ ఉన్న వాళ్లతో కలవడం ముఖ్యం.
మనిషికి చేసే సాయం...
పక్కవాళ్లకి సాయం చేయడం వల్ల వాళ్లకు మేలు జరగడమే కాదు మీ మూడ్ బూస్ట్ అవుతుంది. ఇదే విషయం చాలా రీసెర్చ్‌ల్లో వెల్లడైంది. ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు ఇలాంటివి చాలా సాయపడతాయి. అందుకని మొదట ఆసక్తులు, లక్ష్యాలు ఏంటనేవాటి పట్ల స్పష్టత ఉండాలి. ఆ తరువాత సరైన అవకాశాన్ని వెతుక్కోవాలి. అలాగే కొందరిలో జంతు ప్రేమ మెండుగా ఉంటుంది. పెట్‌కేర్ చేయొచ్చు. దానివల్ల ఎమోషనల్ డిస్ట్రెస్ తగ్గుతుంది. వాటిని దగ్గరకు తీసుకోవడం వల్ల ఫీల్‌గుడ్ హార్మోన్ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందని రీసెర్చ్‌లు చెప్తున్నాయి.
ఒంటరితనం విపరీతంగా బాధపెడుతున్నప్పుడు ఇలాంటివి చాలా బాగా పనిచేస్తాయి. అయితే ఒకటిరెండుసార్లు కాకుండా ఎక్కువసార్లు ఒంటరితనం ఇబ్బందిపెడుతుంటే కనుక థెరపిస్ట్‌ను కలవాలి. అలాగే దాన్నుంచి బయటపడేందుకు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చూస్తే ప్రాక్టకిల్గా చాలా మార్గాలు ఉన్నాయి.