నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన మలి దశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మ బలిదానాల వల్ల రాష్ట్రం ఏర్పాటైంది. ‘మా ఉద్యోగాలు - మాకు కావాలి’ అన్నది ఉద్యమం సమయంలో రాష్ట్ర యువత, నిరుద్యోగులు, విద్యార్థుల ప్రధాన డిమాండ్. రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ప్రాణాలు సైతం అర్పించారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు అవుతున్నా నేటికీ తెలంగాణ యువత నిరుద్యోగ సమస్యనెదుర్కోవడం దారుణం. తెలంగాణ వస్తే లక్షల్లో ఉద్యోగాలొస్తాయనుకున్న యువత పరిస్థితి.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే దయనీయంగా తయారైంది. రాష్ట్ర సాధన కోసం అన్నీ వదులుకొని పోరాడిన యువకులు నేడు మధ్య వయసుకు చేరి, కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్ల కోసం చూసి చూసీ, ఎటుగాలేక ఆగమైపోతున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. పదిమందిలో తలెత్తుకొని తిరగలేక వేదన అనుభవిస్తున్నారు.
వేల సంఖ్యలో ఖాళీలు
తెలంగాణ రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో అధ్యాపక శాంక్షన్ పోస్టులు 2,828 ఉంటే వాటిలో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో మంజూరైన పోస్టులు 2,730. ఇందులో భర్తీ అయినవి 1,419, ఖాళీలు 1,311. జూనియర్ కాలేజీల్లో మొత్తం మంజూరు అయిన పోస్టులు 5,278. ఇందులో భర్తీ అయినవి 836, ఖాళీలు 4,442 ఉంటే, ఇటీవల కేవలం 1,392 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని కళాశాల రంగంలో మంజూరు అయిన పోస్టులు14,008 కాగా అందులో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 3,685 మాత్రమే. ఇంకా 10,331 ఖాళీలు ఉన్నాయి. పాఠశాల విద్యదీ అదే పరిస్థితి. అసెంబ్లీలో 2014 నవంబర్ 24న చేసిన ప్రకటన సందర్భంగా నాటి ఆర్థికమంత్రి 24,261 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇంకా 20 వేల పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను శంకుస్థాపనలతో , శిలాఫలకాలతో ఎలా అయితే మోసం చేస్తుందో అలాగే నిరుద్యోగులను కూడా మోసం చేయాలని చూస్తున్నది. అందుకే ఎన్నికల ఏడాది వరుస నోటిఫికేషన్లు ఇచ్చింది. మొత్తం 42,528 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే అసలైన ఖాళీల సంఖ్య మాత్రం 2,57,126.
తొమ్మిదేండ్లుగా నిరాశే..
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమౌతుందని ఆశించిన యువతకు తొమ్మిదేండ్లుగా నిరాశే ఎదురైంది. ప్రభుత్వం అనేక మార్లు త్వరలో నోటిఫికేషన్స్ అంటూ ప్రకటనలు విడుదల చేసినా కార్యరూపం దాల్చలేదు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వ అలసత్వంపై తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత గమనించిన ప్రభుత్వం ఎన్నికల్లో నష్టపోతామనే భావనతో అసెంబ్లీ సాక్షిగా 82, 000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించింది. నోటిఫికేషన్ విడుదల చేయడంలో మాత్రం అలసత్వమే ప్రదర్శించి ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల చేయడంతో ఏళ్ల పాటు రాత్రింబవళ్లు అనేక కష్టనష్టాలకోర్చి చదివిన నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ చూసి షాక్ అయ్యారు. ఇంత దారుణ ఘటన జరిగినా, ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో, నిరుద్యోగ యువతకు భరోసా కల్పించలేకపోయింది. ప్రభుత్వాధినేతగా సీఎం కేసీఆర్ఇప్పటికీ పేపర్ల లీకేజీలపై కనీసం స్పందించకపోవడం దారుణం. పార్టీ వ్యవహారాలు, ఎన్నికల విజయాల అనంతరం, దేశ రాజకీయాలపై గంటల తరబడి మీడియా సమావేశాలు నిర్వహించే ఆయనకు నిరుద్యోగుల కష్టాలు ఎందుకు కనిపించవు?
సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదు
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంపై ఏర్పాటు చేసిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’పై నిరుద్యోగ యువతకు విశ్వాసం లేదు. దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ప్రభుత్వం వేసిన సిట్లు ఆయా కేసుల దర్యాప్తులను ఎక్కడికి తీసుకువెళ్లాయన్నది తెలంగాణ సమాజానికి తెలుసు. కాలయాపనతో కేసును నీరుగార్చేందుకే.. ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు యువత అనుమానిస్తున్నది. కొలువులొస్తయని కొట్లాడిన యువత.. ఇవ్వాళ తమ బతుకులతో ఆడుకుంటున్న వ్యవస్థలకు బుద్ధి చెప్పేందుకు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నది. తమ కన్నీళ్లను పట్టించుకోని అధినేతకు జవాబు ఇచ్చేందుకు కదం తొక్కుతున్నది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉస్మానియా గడ్డనే అందుకు వేదిక కాబోతున్నది.
పొంతన లేని లెక్కలు
తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఖాయమనుకున్న యువత.. రాష్ట్రం తెచ్చుకోవడానికి ప్రాణాలు అర్పించింది. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడిచినా ఆ అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఘోష, వారి కుటుంబాల ఆవేదన, నిరుద్యోగుల ఎదురు చూపులు అటుండగా, మళ్లీ యువత ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితి రావడం.. తీరని అన్యాయమే. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల విషయంలో మంత్రులు, ఆర్థికశాఖ, వేతన సవరణ సంఘం పేర్కొన్న వివరాల్లో ఏమాత్రం పొంతన లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర వాటాకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 5,23,675 అని ప్రభుత్వం 2014 నవంబర్ 24న అసెంబ్లీలో ప్రకటించింది. ఇందులో 83 వేల మంది ఆంధ్రా ఉద్యోగులున్నారని, వారిని వాళ్ల రాష్ట్రానికి పంపిస్తామని చెప్పింది. తద్వారా ఏర్పడ్డ ఖాళీలను తెలంగాణ నిరుద్యోగ యువతతో భర్తీ చేస్తామని తెలిపింది. కానీ ఈ 83 వేలల్లో ఎంతమందిని పంపించింది, ఇంకా ఎంతమంది ఉన్నది వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదు. సమాచార హక్కు చట్టం కింద 2017 ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. మన రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 2,96,687 కాగా తాజాగా వేతన సవరణ సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఉండాల్సిన ఉద్యోగులు 4,91,304 మంది. ప్రస్తుతం ఉన్నది 3,00,178 మంది. ఖాళీలు 1.91.126, ప్రతి 1000 మందికి మన రాష్ట్రంలో 8.5 మంది ఉద్యోగులున్నట్లు వేతన సంఘం పేర్కొంది. ఈ లెక్కల్లో ఎక్కడా పొంతన లేదు.