బీఆర్ఎస్​ పదేండ్ల పాలనపై వ్యతిరేకత ఉండొచ్చు : చైర్మన్ ​గుత్తా

నల్గొండ, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్​ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చని మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి అభిప్రాయపడ్డారు. అయినా, సీఎం కేసీఆర్​పాలనను ప్రజలు వదులుకునే పరిస్థితుల్లో లేరన్నారు. స్థానిక సమస్యలు, అభ్యర్థుల మీద అసంతృప్తి, పార్టీలో భేదాభిప్రాయాలు ఉండొచ్చన్నారు. గురువారం నల్గొండలో మీడియాతో ‘గుత్తా’ చిట్​చాట్​ చేశారు. రూ.లక్ష రుణ మాఫీ ఇవ్వడానికి బీఆర్ఎస్​ప్రభుత్వానికి ఐదేండ్లు పట్టిందని, అలాంటిది కాంగ్రెస్​ రూ.2 లక్షల రుణమాఫీ ఏవిధంగా చేస్తుందని ప్రశ్నించారు.

రుణ మాఫీ ఆలస్యం కావడానికి రైతుబంధు, రైతు బీమా పథకాలే ప్రధాన కారణమన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏనాడో ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగిందని, పదేండ్ల నుంచి బీజేపీ ఎస్సీ వర్గీకరణ గురించి ఎందుకు నోరెత్తలేదన్నారు. కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కిషన్​ రెడ్డికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి, ఆయన నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని సవాల్​ విసిరారు.