- నోటాకు పెరుగుతున్న ఓట్లు
- ఈసారి పోటీలో 39 మంది అభ్యర్థులు
- ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన
యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్‌సభ పరిధిలో ఎక్కువ మంది ఇండిపెండెంట్లు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్పట్టుకున్నది. గత ఎన్నికల్లో పది మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉండగా, ఈసారి ఏకంగా 34 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఎవరు ఎన్ని ఓట్లు గుంజుకుంటారో..? ఎవరికి నష్టం చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో ఈసారి 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ పోటీ చేస్తోంది. 16 మంది రిజిస్ట్రర్డ్ పార్టీ అభ్యర్థులు, 18 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న కారణంగా మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్కల్పించింది.
రెండు ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా ఓట్లు..
గత ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు ఒక్కొక్కరికి 1500 నుంచి 27 వేల ఓట్ల వరకూ పడ్డాయి. ఈ విధంగా 2009 ఎన్నికల్లో రిజిస్ట్రర్డ్పార్టీల అభ్యర్థులు సహా 11 మంది ఇండిపెండెంట్లకు 1,08,702 ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిజిస్ట్రర్డ్ పార్టీల అభ్యర్థులు సహా ఇండిపెండెంట్లు (10 మంది)కు 97,795 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో రిజిస్ట్రర్డ్ పార్టీల అభ్యర్థులు సహా 10 మంది ఇండిపెండెంట్లకు 46,629 ఓట్లు వచ్చాయి. ఈ స్థాయిలో ఇండిపెండెంట్లు ఓట్లు సాధిస్తుండడంతో ఆ ప్రభావం ప్రధాన పార్టీల అభ్యర్థులపై పడుతోంది.
2019 ఎన్నికల్లో 0.4 శాతంతోనే గెలుపు..
2019 లోక్‌సభ ఎన్నికల్లో నోటా సహా14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 12,12,631 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులతోపాటు మరో తొమ్మది మంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు లభించాయి. కాంగ్రెస్అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5,32,795 (43.93 శాతం) ఓట్లు, బీఆర్ఎస్అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్(ప్రస్తుత బీజేపీ అభ్యర్థి)కు 5,27,576 (43.5 శాతం) ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య 4 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి పీవీ శ్యాంసుందర్‌రావుకు 65,457 (5.4 శాతం) ఓట్లు, సీపీఐ అభ్యర్థి గోద శ్రీరాములుకు 28,153 (2.32 శాతం) ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్అభ్యర్థి సింగపాక లింగంకు 27,973(2.31 శాతం) ఓట్లు రాగా, నోటాకు 12,021(0.99 శాతం), మిగిలిన ఇండిపెండెంట్లకు 18,656 ఓట్లు కలిపి మొత్తంగా 58,650 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడి వెంకటరెడ్డి 5219 (4 శాతం) ఓట్ల తేడాతో గెలుపొందారు.
2014లో 2.04 శాతం..
2014 ఎన్నికల్లో నోటా సహా 14 మంది పోటీ చేయగా 12,11,732 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 1,83,249 (12.28 శాతం) ఓట్లు వచ్చాయి. సీపీఎం అభ్యర్థి చెరుపల్లి సీతారాములుకు 54,035 (3.62 శాతం) ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 4,17,620 (27.99 శాతం) ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కి 4,48,164 (30.3 శాతం) ఓట్లు వచ్చాయి. నోటాకు 10,907 (0.73 శాతం) ఓట్లు రాగా ఇండిపెండెంట్లకు 98,117 ఓట్లు వచ్చాయి. 30,544 (2.4శాతం) ఓట్ల తేడాతో బూర నర్సయ్య గౌడ్ గెలుపొందారు.
2009 ఎన్నికల్లో 9.37 శాతం తేడాతో..
భువనగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడింది. మొదటి ఎన్నికల్లో 15 మంది అభ్యర్థుల పోటీ చేయగా 11,27,790 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతా సాంబమూర్తికి 45898 (3.1 శాతం) ఓట్లు వచ్చాయి. పీఆర్పీ అభ్యర్థి గండం చంద్రమౌళికి 1,04,872 (7.09 శాతం) ఓట్లు రాగా, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యకు 3,64,215 (24.64 శాతం) ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 5,04,103 (34.01 శాతం) ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లకు 1,08,702 ఓట్లు వచ్చాయి. 1,39,888 (9.37) శాతం ఓట్ల తేడాతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు.