ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంద చోట్లకుపైగా మినీ మేడారాలు

  •     ఊరూరా జాతరలే 
  •     జాతరకు అమ్మవార్ల గద్దెలు ముస్తాబు 
  •     ఏర్పాట్లు చేస్తున్న జాతర కమిటీలు, ప్రభుత్వ యంత్రాంగం 

కరీంనగర్/గోదావరిఖని, వెలుగు: వనదేవతలైన సమ్మక్క, సారలమ్మల జాతరకు ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని అమ్మవార్ల గద్దెలు ముస్తాబయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు వంద చోట్ల జాతరలు జరగనున్నాయి. మినీ మేడారాలుగా పేరొందిన కరీంనగర్ సిటీలోని రేకుర్తి, కేశవపట్నం, గన్నేరువరం, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఒబులాపూర్, వీర్నపల్లి మండలం శాంతినగర్ తండాలో, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, కోనరావుపేట మండలం శివంగళపల్లె, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, అంతర్గాం మండలం గోలివాడ, సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల - వేగురుపల్లి,  గోదావరిఖని పట్టణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ నెల 21న సారలమ్మ ఆగమనంతో ప్రారంభమయ్యే జాతర 22న సమ్మక్క ఆగమనం, 24న తల్లీబిడ్డల వన ప్రవేశంతో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలో జరిగే జాతరలకు లక్షలాది మంది భక్తులు రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీలు ఏర్పాట్లు చేశాయి. గద్దెలకు రంగులు వేయడంతోపాటు భక్తులకు చలువ పందిళ్లు, తాగునీరు, క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు.

కరీంనగర్ సిటీలోని రేకుర్తిలో సమ్మక్క- సారలమ్మ జాతరకు బల్దియా, ఎండోమెంట్ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 1990లో పిట్టల రాజమల్లయ్య ఇక్కడ అమ్మవార్ల గద్దెలు నిర్మించారు. ఇక్కడ కోయ పూజారులే పూజలు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లా నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. 2018లో 3.5 లక్షల మంది రాగా, 2020లో 4 లక్షలు, 2022లో నాలుగున్నర లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నారు. 

కేశవపట్నంలో సమ్మక్క, సారలమ్మ జాతరను గౌడ కులస్తులు 1978 నుంచి నిర్వహిస్తున్నారు. గుర్రం వీరయ్య, గడ్డం లింగయ్యకు కలలో వన దేవతలు కనిపించడంతో జాతర ప్రారంభించారు. అప్పటి నుంచి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు. ఇక్కడికి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ నుంచి సుమారు 5 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

గన్నేరువరం మండలకేంద్రంతోపాటు మైలారం గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతరకు అమ్మవార్ల గద్దెలు ముస్తాబయ్యాయని ఆలయ కమిటీ అధ్యక్షులు బోయిని పోచయ్య, విలాసాగరం రామచంద్రం తెలిపారు. మైలారం శివారులోని మానేరు నది తీరాన జాతర నిర్వహిస్తారు. చుట్టూ గుట్టలు, చెట్లతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా భక్తులను కనువిందు చేస్తోంది. 

'ఖని'లో జాతరకు సర్వం సిద్ధం 

గతంలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మేడారం జాతరకు భారీగా తరలివెళ్లడంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి కుంటుపడుతుందనే ఉద్దేశంతో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంటే స్వయంగా సౌకర్యాలు కల్పించి 1992 నుంచి గోదావరి ఒడ్డున జాతర ప్రారంభించింది. ఆ తర్వాత ఈ జాతర ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిందకు రావడంతో ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్​ఎఫ్​సీఎల్​ సంస్థలు జాతర నిర్వహణకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈ సారి జాతరకు 5 లక్షల మంది భక్తులు వస్తారని జాతర కమిటీ చైర్మన్​ శ్రీనివాసరెడ్డి, ఈవో కాంతారెడ్డి తెలిపారు.