
పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ లో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి విపక్షాలు. ఓటింగ్ అక్రమాలు, హిందీ, డీలిమిటేషన్, మణిపూర్ అల్లర్లపై విపక్షాలు ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చేశాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు డీఎంకే, తృణమూల్ తదితర పార్టీలు వివిధ అంశాలపై గొంతెత్తడంతో సమావేశాలు వాయిదాల పర్వం అందుకున్నాయి. సోమవారం (మార్చి 10) సమావేశాలు ప్రారంభం కాగానే డీఎంకే సభ్యులు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై పట్టుబట్టారు. హిందీని బలవంతంగా రుద్దడంపై ఉభయసభలను స్తంభింపజేశారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
వాయిదా తర్వాత విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ తిరిగి ప్రారంభమయ్యింది. లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటింగ్ అవకతవకలపై గళమెత్తారు. ఓటింగ్ లో అక్రమాలు జరిగాయని, దేశవ్యాప్తంగా దీనిపై సందేహాలు ఉన్నాయనే అంశాన్ని లేవనెత్తారు. ‘‘ఓటింగ్ లో అక్రమాలు జరిగాయనే ఆందోళన అన్ని పార్టీలలో ఉంది. విపక్ష పార్టీలన్నీ ఈ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నాయి. ఈ అంశంపై చర్చ పెట్టాల్సిందే’’ నని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల సభ్యులు చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు.
ALSO READ | డీఎంకే వర్సెస్ బీజేపీ.. దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు
ఇక రాజ్యసభలో డీఎంకే సభ్యులు జాతీయ విద్యా విధానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. డీలిమిటేషన్ అంశంపై ఆందోళకు దిగారు. దీనిపై ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్.. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో డీఎంకే ఎంపీలకు, ధర్మేంద్ర ప్రదాన్ కు మధ్య వాగ్వాదం చెలరేగింది. ‘‘డీఎంకే సభ్యులకు విద్యార్థుల భవిష్యత్ పై శ్రద్ధ లేదు. విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేస్తు్న్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు’’అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు డీఎంకే ఎంపీలు.
విపక్ష ఎంపీల ఆందోళనపై రాజ్యసభ వ్యవహారాల మంత్రి జేపీ నడ్డా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ వ్యవహారంపై చర్చకు పట్టబట్టడం పార్లమెంటును అవమానించినట్లేనని అన్నారు. అదే విధంగా జాతీయ విద్యావిధానంపై డీఎంకే వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని అన్నారు. సభ్యులకు సమస్యలపై చర్చించే ఉద్దేశం లేదని, కేవలం ఆందోళనతో సభలను గందరగోళానికి గురిచేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ నుంచి విపక్షాలు వాక్ అవుట్ చేశాయి.
ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చతో పాటు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు తదితర కీలక బిల్లులకు ఆమోదం కోసం ప్రభుత్వం ప్రయత్ని్స్తున్న తరుణంలో విపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది.