నిజామాబాద్లోని 24 పంచాయతీల్లో నో స్కూల్స్​

నిజామాబాద్లోని 24 పంచాయతీల్లో నో స్కూల్స్​
  •     ఉన్నతాధికారుల ఆదేశాలతో రిపోర్ట్​ పంపిన అధికారులు
  •     ఉమ్మడి జిల్లాలో ఆరు పంచాయతీల్లో స్కూల్స్​ఓపెనయ్యే ఛాన్స్​
  •     ప్రతీ పంచాయతీలో బడి ఉండాలని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో 24 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ బడులు లేవు. ఆరు పంచాయతీల్లో స్కూల్స్​ఓపెన్ చేయొచ్చని ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అకాడమిక్​ఇయర్​లో ఈ స్కూల్స్​ స్టార్ట్​అయ్యే ఛాన్స్​ ఉంది. గత నెల 30న సీఎం రేవంత్​రెడ్డి విద్యాశాఖపై రివ్యూ నిర్వహించారు. స్కూళ్ల స్థితిగతులు, టీచర్​పోస్టుల ఖాళీలపై చర్చించారు.

చిన్న ఊరైనా, మారుముల తండా అయినా తప్పనిసరిగా స్కూల్​ఉండాల్సిందేనని ఉన్నతాధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆయా జిల్లాలో గవర్నమెంట్ ​స్కూళ్లు లేని పంచాయతీలను ఆరా తీశారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఫార్మెట్​లో  వివరాలు సేకరించారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం1056 గ్రామ పంచాయతీలుండగా, 2,207 గవర్నమెంట్​స్కూళ్లు ​ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో జీరో ఎన్​రోల్​మెంట్ కారణంగా అక్కడి  టీచర్లను వేరే స్కూళ్లకు డిప్యూటేషన్​పై పంపారు.

కామారెడ్డిలో జిల్లాలో 38 జీరో ఎన్​రోల్​మెంట్ ​స్కూల్స్​ ఉన్నాయి.  అసలు స్కూల్స్​లేని పంచాయతీలు ఉమ్మడి జిల్లాలో 24 ఉండగా అందులో నిజామాబాద్​లో14, కామారెడ్డిలో 10 ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం కొల్లూర్, జుక్కల్​మండలం మథుర తండా, కామారెడ్డి మండలం కొటాల్​పల్లి, మాచారెడ్డి మండలం వెనుకతండా, నెమ్లిగుట్ట తండా, సర్దాపూర్ ​తండా, మర్రితండా, పిట్లం మండలం జగన్నాథ్​ తండా, సదాశివ్​నగర్​మండలం దగ్గి, ఎల్లారెడ్డి మండలం దేవల్​ మల్కాపల్లెలో స్కూల్స్​లేవు.  

ఆరు స్కూల్స్​ తెరిచే ఛాన్స్​

ఉమ్మడి జిల్లాలో ఆరు పంచాయతీల్లో స్కూల్స్ అవసరమని విద్యాశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. స్కూల్స్​లేని పంచాయతీలకు సమీపంలో అర కిలో మీటర్​పరిధిలో మరో పంచాయతీలో స్కూల్ ఉండడం, కొన్ని పంచాయతీల్లో తక్కువ మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. కిలో మీటర్​ కంటే ఎక్కువ దూరంలో స్కూల్స్​ఉన్న పంచాయతీల్లో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ​మండలం మథురతండా, సదాశివ్​నగర్​మండలం దగ్గి, ఎల్లారెడ్డి మండలం దేవల్​ మల్కాపల్లెలో అవసరమని రిపోర్ట్​ ఇచ్చారు.

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం బీబీపూర్​ తండా, వర్ని మండలం నెహ్రూనగర్, ముప్కాల్​ మండలం సింగంపల్లిలో స్కూల్ అవసరమని నివేదించారు. జీరో ఎన్​రోల్​మెంట్ ​ఉన్న స్కూళ్లలోనూ స్టూడెంట్స్​చేరతే వీటిని వచ్చే అకాడమిక్​ఇయర్​ఓపెన్​చేయొచ్చని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే 24 పంచాయతీల్లోనూ స్కూళ్లు​ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

నివేదికలు పంపించాం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాళ్లు అడిగిన ఫార్మెట్​లో ఇన్ఫర్మేషన్​ పంపిచాం. జిల్లాలో 10 పంచాయతీల్లో అసలు స్కూల్స్​లేవు. మూడు పంచాయతీలకు కిలోమీటర్​పైగా దూరంలో ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశిస్తే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశముంది.
– రాజు, డీఈవో, కామారెడ్డి