- - ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు
- 4,400 గ్రామాలకు ఇబ్బందులు
- జూన్ వరకు నీటిఎద్దడి రావొద్దంటే మరో 2 టీఎంసీలు అవసరం
- మంత్రులు స్పందిస్తేనే సమస్యకు పరిష్కారం!
ఖమ్మం/కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో మరో పది రోజులకు సరిపడ తాగునీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం పాలేరు నీటిమట్టం 14.90 అడుగులు కాగా, 1.3 టీఎంసీల నీరు ఉంది. అందులో 0.9 వరకు డెడ్ స్టోరేజీ, 0.4 టీఎంసీ నీరు మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. ఇందులో నుంచి మూడు జిల్లాల పరిధిలోని మిషన్ భగీరథ పథకం ద్వారా 4,400 గ్రామాలకు రోజుకు 125 క్యూసెక్కుల తాగునీరు అందిస్తున్నారు.
మరో 75 క్యూసెక్కుల నీరు లాస్ అవుతుంది. శుక్రవారం కృష్ణా రీవర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటి మీటింగ్ జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. మూడు జిల్లాల్లో తాగునీటి గండం నుంచి బయట పడాలంటే మరో 2 టీఎంసీల నీరు కావాలి. దీనికి సీఈ, ఎస్ఈ ( కేఆర్ఎంబీ)ని రిక్వెస్ట్ చేసి నీటిని తీసుకువస్తే జూన్వరకు తాగునీటికి ఇబ్బంది ఉండదు. లేదంటే మూడు జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవు.
‘సాగర్’ నుంచీ వచ్చే పరిస్థితి లేదు!
నాగార్జునసాగర్ లోనూ ప్రస్తుతం నీరు డెడ్ స్టోరేజీకి చేరింది. వర్షాకాలం సీజన్ లో క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాలు లేకపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి కూడా ఇన్ ఫ్లో రాకపోవడంతో సాగర్ నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. ఉన్న కొద్దిపాటి నీటిని కూడా ఎన్నికలకు ముందు, ఖమ్మం జిల్లాలోని ఆయకట్టు కింద వర్షాకాలం పంటలను కాపాడేందుకు అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది.
దీంతో ఇప్పుడు సాగర్ నుంచి తాగునీటి కోసం అయినా నీళ్లు వస్తాయా లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వలు కూడా అందుబాటులో ఉండడంతో అక్కడి నుంచైనా గోదావరి జలాలు రప్పించి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లా మంత్రులు చొరవ తీసుకుంటే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.