సెస్ లో అవినీతి బాగోతం

 

  • 10,800  కరెంట్ పోల్స్​ లెక్క తేలట్లే
  • ఇద్దరు ఏడీలతో విచారణ

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్ ) లో అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. సెస్ పరిధిలో  13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో  వేసిన  10,800  పోల్స్ లెక్క తేలడం లేదు. 2006  నుంచి అక్రమాలు జరిగినట్లు  తెలుస్తోంది.  ఇన్నాళ్లు సెస్ లో జరిగిన అవినీతిపై కొత్త పాలక వర్గం దృష్టి  సారించినట్లు వార్తలు వస్తున్నాయి. 

2006 నుంచి అక్రమాలు

సెస్ పరిధిలో ఉన్న  గ్రామాల్లో అవసరమైన చోట  కరెంట్ పోల్స్​ను సంస్థ వేయించింది. లూజ్ లైన్ల రిపేర్ల కోసం రైతుల పొలాలకు కరెంట్ పోల్స్ ను వేశారు.  అయితే పోల్స్  వేయడంలో 2006 నుంచి భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.   ఈ పనులలో జరిగిన అక్రమాలపై కొత్త పాలక వర్గం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేట మండలంలో అధికంగా అవినీతి జరిగిందని  గతంలో ప్రచారం జరిగింది. 10,800  కరెంట్​ పోల్స్​ ఎక్కడ వేశారనే విషయం లెక్క తేలడం లేదు. సెస్ సిబ్బంది, కాంట్రాక్టర్ కుమ్మక్కై అక్రమాలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే సెస్ పరిధిలో ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్ లు, అధికారుల సహకారంతోనే  కరెంట్ పోల్స్​ను అమ్ముకున్నారని విశ్వసనీయ సమాచారం. రైతులకు ఒక్కో స్థంభాన్ని రూ.3వేలకు విక్రయించారని తెలిసింది. గత పాలకవర్గంలోని డైరెక్టర్లు, సెస్ సిబ్బంది, కాంట్రాక్టర్ కుమ్మక్కై  కరెంట్​ పోల్స్​ను మాయం చేసినట్టు సమాచారం.

విచారణకు ఆదేశం

సెస్ లో జరిగిన ఆక్రమాలపై కొత్త పాలక వర్గం ఫోకస్ పెట్టింది. లెక్కతేలని 10,800  కరెంట్​ పోల్స్​కు​ సంబంధించిన రూ.3 కోట్ల అవినీతిపై విచారణకు ఆదేశించింది.  దీని కోసం  ఇద్దరు ఏడీలను సెస్ చైర్మన్ చిక్కాల రామారావు నియమించారు. వీరు విచారణకు మొదలుపెట్టారు. త్వరలోనే  రూ. 3 కోట్లకు సంబంధించిన అవినీతి బట్టబయలు కానుంది.

ఎవ్వరినీ వదిలిపెట్టం

సెస్ లో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించా. అక్రమాలు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టను . ఎల్లారెడ్డిపేట, చందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి మండలాల్లో ఆవినీతి జరిగింది. కరెంట్ పోల్స్ రైతులకు అమ్ముకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. విచారణలో తేలిన వారిపై చర్యలు చేపడతాం. 

  - సెస్ చైర్మన్, చిక్కాల రామారావు