కాళేశ్వరం భూసేకరణ కుట్రపై సమగ్ర విచారణ చేయాలి

కాళేశ్వరం భూసేకరణ కుట్రపై సమగ్ర విచారణ చేయాలి
  • జస్టిస్ ఘోష్ కమిషన్​కు మహారాష్ట్ర  రైతుల లేఖ 
  • కేసీఆర్​ నిలువునా ముంచేశారని మహారాష్ట్ర రైతుల ఆవేదన

మహదేవపూర్, వెలుగు : తెలంగాణ, మహారాష్ట్ర ఇరిగేషన్ ఇంజినీర్లు కుమ్మక్కై మేడిగడ్డ బ్యారేజీ పేరుతో తమ భూములను అప్పనంగా కేసీఆర్​కు అప్పగించి తమను నిలువునా ముంచేశారని మహారాష్ట్ర రైతులు ఆరోపించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో వారు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో జరిగిన కుట్రపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని  జస్టిస్ ఘోష్ కమిషన్ కు లేఖ రాసినట్టు చెప్పారు. 12 గ్రామాలలో 500 ఎకరాల భూమి  ముంపునకు గురవుతున్నదని, తమకు న్యాయం చేయాలని ఆరేండ్లుగా పోరాడుతున్నా ఫలితం లేదని వాపోయారు. తాతల కాలం నుంచి గోదావరి మీదే ఆధారపడి పంటలు పండించుకుంటున్నామని, తమ భూములను బ్యారేజీ కోసం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం  పరిహారం ఇవ్వలేదన్నారు.  తమకు న్యాయం చేయాలని గతంలో వంద రోజులు ఆందోళన చేశామని, అయినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించాలని వారు కోరారు.