రైల్వే భద్రతపై నిరంతర.. పర్యవేక్షణ ఉండాలి: సౌత్​ సెంట్రల్ రైల్వే జీఎం ​

సికింద్రాబాద్, వెలుగు:  రైల్వే భద్రతపై క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులు, సూపర్‌‌‌‌ వైజర్లను సౌత్​ సెంట్రల్ రైల్వే జనరల్​ మేనేజర్​అరుణ్​కుమార్​ జైన్​ఆదేశించారు. రైల్వే కార్యకలాపాలకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులతో సికింద్రాబాద్‌‌‌‌లోని రైల్ నిలయంలో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రైళ్లు, స్టేషన్లలో భద్రతా అవసరాలపై చర్చించారు. అగ్నిమాపక పరికరాలతో సహా భద్రతా వ్యవస్థపై  ప్రాథమిక దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి తరచూ కౌన్సెలింగ్‌‌‌‌ ఇవ్వాలని , అన్నిరకాలుగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.  ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్, టెలి కమ్యూనికేషన్స్, ఆపరేటింగ్ , ఇంజినీరింగ్ వంటి విభాగాలను కలుపుకొని పనిచేయాలని చెప్పారు. రిజిస్టర్ల నిర్వహణ, వర్షాకాలంలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లతో సహా రన్నింగ్ సిబ్బంది పనివేళలను పరిశీలించారు. సరుకు రవాణా అవసరాలను తీర్చడానికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి సరుకు రవాణాను మరింత పెంచడానికి కృషిని కొనసాగించాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో  సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్లకు చెందిన రైల్వే మేనేజర్లు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ALSO READ :మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే : వాతావరణ శాఖ