హద్దు మీరితే అనుభవించాల్సిందే.. కమెడియన్ కమ్రా వ్యాఖ్యలపై ఏక్​నాథ్​ షిండే స్పందన

హద్దు మీరితే అనుభవించాల్సిందే.. కమెడియన్ కమ్రా వ్యాఖ్యలపై ఏక్​నాథ్​ షిండే స్పందన
  • దేనికైనా ఓ హద్దంటూ ఉంటుందన్న డిప్యూటీ సీఎం
  • పార్టీ కార్యకర్తల విధ్వంసం తప్పే.. కానీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది

ముంబై: స్టాండప్​ కమెడియన్​ కునాల్​కమ్రా వేసిన సెటైర్​ తనకు అర్థమైందని, కానీ దేనికైనా ఓ పరిమితి ఉంటుందని  శివసేన నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్​నాథ్​ షిండే  అన్నారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరి దగ్గరినుంచో సుపారీ తీసుకోవడం లాంటివేనని పోల్చారు.  ఇటీవల ముంబైలోని యూనికాంటినెంటల్‌‌ హోటల్‌‌ హాబిటాట్‌‌ కామెడీ స్టూడియోలో నిర్వహించిన షోలో ఏక్​నాథ్​ షిండేపై కునాల్‌‌ కమ్రా సెటైర్లు వేశారు.  దీనిపై మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే స్పందించారు.  

ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ ముఖ్యమేనని, కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నిర్మలా, అమిత్​ షా, ప్రముఖ జర్నలిస్టుల గురించి కూడా ఏం మాట్లాడారో ఒకసారి చూడండి అని కునాల్​ కమ్రా గతంలో చేసిన కామెంట్స్​ను ప్రస్తావించారు. 

తన పార్టీ కార్యకర్తలు చేసిన విధ్వంసం తప్పేనని, వాటిని తాను సమర్థించడం లేదని చెప్పారు. కానీ, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంద న్నారు. ప్రజలు ప్రతిపక్ష స్థానం ఇచ్చినా కొందరు మారడంలేదని,  ఇతరులను అవమానిస్తూ కుట్ర చేస్తున్నారని పరోక్షంగా విమర్శలు చేశారు.

కునాల్ ​కమ్రాకు పోలీసుల నోటీసులు

షిండేపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసులో కునాల్​కమ్రాకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనపై  నమోదైన కేసుకు సంబంధించి ముంబైలోని ఖార్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరినట్టు ఒక అధికారి తెలిపారు. కమ్రాకు ప్రాథమిక నోటీసు ఇచ్చామని, దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.  కాగా,  శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు ఆధారంగా.. షిండేపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఖార్ పోలీసులు కమ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

నేనెవరికీ క్షమాపణలు చెప్పను: కునాల్​ కమ్రా

తాను ఎవరికీ భయపడనని, ఎవరికీ క్షమాపణలు చెప్పనని కునాల్ కమ్రా తేల్చి చెప్పారు.డిప్యూటీ సీఎం అజిత్​ పవార్ ​ ఒకప్పుడు ఏక్​నాథ్​ షిండేపై చేసిన వ్యాఖ్యలనే తాను గుర్తు చేశానన్నారు. ‘‘మన నాయకులను, సర్కస్‌‌ లాంటి రాజకీయ వ్యవస్థను ఎగతాళి చేయడం చట్టానికి విరుద్ధం కాదు.  ఓ ప్రజానాయకుడిపై నేను వేసిన జోక్‌‌ను తీసుకోలేని మీ అసమర్థత నా హక్కును, స్వభావాన్ని  ఎప్పటికీ మార్చదు” అని పేర్కొన్నారు. తాను చేసిన కామెడీకి ఓ స్టూడియో వేదికను కూల్చడం సరికాదని సర్కారు చర్యలను తప్పుబట్టారు.

కమ్రాకు వేదిక ఇస్తే బుల్డోజర్ ​చర్యలే: బీజేపీ నేత

మహారాష్ట్రలో ఏ స్టూడియో అయినా కునాల్​ కమ్రా ప్రదర్శనకు వేదిక ఇస్తే.. బుల్డోజర్​ చర్యలు తప్పవని బీజేపీ ఎమ్మెల్యే రామ్​ కదం హెచ్చరించారు. వాటి ఆవరణలోని అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తామని స్పష్టం చేశారు. కేవలం 2 నిమిషాల ఫేమ్‌‌ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఎంపీ కంగనా విమర్శించారు.

విద్వేషాలను రెచ్చగొట్టే కామెడీ షోలను నిషేధించాలి: శివసేన ఎంపీ

కునాల్​కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు అటు పార్లమెంట్​లోనూ చర్చకు దారితీశాయి. విద్వేషాలను రెచ్చగొట్టే కామెడీ షోలను నిషేధించాలని మంగళవారం లోక్​సభలో శివసేన ఎంపీ  ధైర్యశీల​మానే డిమాండ్​ చేశారు. కొంతమంది తమ రాజకీయ ఎజెండాను స్టాండ్- అప్ కమేడియన్ల ద్వారా అమలు చేస్తున్నారని ఆరోపించారు. వీటిని అరికట్టేందుకు ఓ ఫ్రేమ్​ వర్క్​ తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.