
హైదరాబాద్ సిటీ, వెలుగు: హాస్పిటల్ లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, స్టాక్ పూర్తికాక ముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. శ్రీరామ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి, సంతకం చేసిన ప్రకారం వైద్యులు, సిబ్బంది ఉన్నారా లేదా అని పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బంది తమకు కొన్ని నెలలుగా వేతనం రావడం లేదని కలెక్టర్ కు తెలపగా, వేతనం మంజూరీ కోసం, అలాగే అంబులెన్స్ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి పేషెంట్స్ అధికంగా వస్తున్నందున 50 బెడ్స్ హాస్పిటల్ గా తీర్చిదిద్దేందుకు అదనంగా మరో గైనకాలజిస్ట్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని డీసీహెచ్ఎస్ ను ఆదేశించారు. ఇన్ చార్జీ డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవనీత రావు, వైద్యులు ఉన్నారు.