- మనవరాళ్ల కోసం ఎస్‌ఎస్‌వై అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలులేదు
- అక్టోబర్ 1 తర్వాత ఎన్‌ఎస్‌ఎస్–87 అకౌంట్‌పై వడ్డీ లేనట్టే
- మైనర్‌కు చెందిన సెకెండరీ పీపీఎఫ్ అకౌంట్లపై పోస్ట్ ఆఫీస్ వడ్డీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) అకౌంట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ స్కీమ్= (ఎన్‌ఎస్‌ఎస్) లలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నవారు ఇబ్బందుల్లో పడినట్టే. కేవలం ఒక అకౌంట్‌ను మాత్రమే ఓపెన్ చేయాలని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
పీపీఎఫ్ ప్రైమరీ అకౌంట్‌కే వడ్డీ
ఇన్వెస్టర్లు కేవలం ఒక పీపీఎఫ్ అకౌంట్‌ను మాత్రమే ఓపెన్ చేయడానికి వీలుంది. ఒకవేళ రెండు అకౌంట్లు ఉన్నాయని తెలిస్తే, వీటిలో ప్రైమరీ అకౌంట్‌ను ఎంచుకోమని అడుగుతారు. సెకెండరీ అకౌంట్లలోని ఫండ్స్ ప్రైమరీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. పీపీఎఫ్ అకౌంట్లలో ఏడాదికి కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. ప్రైమరీ అకౌంట్ కాకుండా మిగిలిన అకౌంట్లలో ఉన్న ఫండ్స్‌కు ఎటువంటి వడ్డీని ఇవ్వరు. 2019 లో నోటిఫై చేసిన రూల్స్ ప్రకారం, 2020 లో చేసిన సవరణల ప్రకారం ఇన్వెస్టర్‌కు రెండు కంటే ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్లు ఉంటే, అదనపు అకౌంట్లలోని ఫండ్స్‌పై ఎటువంటి వడ్డీ ఇవ్వరు. తాజాగా కేవలం ప్రైమరీ అకౌంట్‌లోని ఫండ్స్‌కే వడ్డీని ఇస్తున్నారు.
ఒక మైనర్‌కు ఒక పీపీఎఫ్ అకౌంట్..
ఇన్వెస్టర్లు మైనర్ల తరపున కూడా కేవలం ఒక అకౌంట్‌నే ఓపెన్ చేయడానికి వీలుంది. పిల్లల తరపున ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీన్ని ఆపడానికి తాజాగా రూల్స్‌లో మార్పు చేసింది. ఒక మైనర్ అకౌంట్‌ను ప్రైమరీ అకౌంట్‌గా గార్డియన్స్ గుర్తిస్తే, ఆ మైనర్ పేరు మీద ఉన్న మిగిలిన అకౌంట్లు ‘ఇర్రెగ్యులర్ అకౌంట్స్’ గా పరిగణిస్తారు.
ఈ రూల్స్ ఈ ఏడాది జులై 12 నుంచి అమల్లోకి వచ్చాయి. మైనర్‌కు చెందిన ప్రైమరీ అకౌంట్‌పై ఆఫర్ చేస్తున్న వడ్డీ 7.1 శాతం ఇస్తారు. కానీ, ఇర్రెగ్యులర్ అకౌంట్‌పై ఆ మైనర్ వయసు 18 ఏళ్లు చేరుకునేంత వరకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై ఇచ్చే వడ్డీ 4 శాతాన్ని ఇస్తారు. మైనర్ వయసు 18 ఏళ్లు దాటాక ఇర్రెగ్యులర్ అకౌంట్లను పెద్దవారికి ఉండే అదనపు పీపీఎఫ్ అకౌంట్లుగా చూస్తారు. అంటే వీటిపై వడ్డీ రాదు. ప్రస్తుత రూల్స్ ప్రకారం పెద్దవాళ్లలో ఒకేసారి ఒకరికి ఒక పీపీఎఫ్ అకౌంట్ మాత్రమే ఉండాలి.
ఎన్‌ఆర్‌ఐ స్టేటస్ చెప్పకపోతే అంతే..
ఎన్‌ఆర్‌ఐ స్టేటస్‌ను బయటపెట్టకుండా పీపీఎఫ్ అకౌంట్లను ఓపెన్ చేస్తే, వీరికి ఈ ఏడాది జులై 12, సెప్టెంబర్ 30 మధ్య కేవలం 4 శాతం వడ్డీ (పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ రేట్) మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత వడ్డీ ఇవ్వరు. పీపీఎఫ్ రూల్స్ ప్రకారం, ఎన్‌ఆర్‌ఐలు అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి కుదరదు. ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేశాక ఎన్‌ఆర్‌ఐగా మారితే అకౌంట్ మెచ్యూర్ అయ్యేంత వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ, ఇండియన్స్‌లా ఐదేళ్ల పాటు పొడిగించుకోవడానికి వీరికి వీలుండదు. ఎన్‌ఆర్ఐ స్టేటస్‌ను బయటపెట్టని వారికే తాజా రూల్ వర్తిస్తుంది.
ఆడపిల్లలకు గార్డియన్సే అకౌంట్ ఓపెన్ చేయాలి..
ఆడపిల్లలకు సంబంధించి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను కేవలం గార్డియన్ మాత్రమే ఓపెన్ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. చాలా మంది తమ మనవరాళ్ల కోసం ఈ అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. తాజా రూల్స్ ప్రకారం, లీగల్ గార్డియన్ లేదా ఆడపిల్లల తల్లిదండ్రులు మాత్రమే ఆమె పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను ఓపెన్ చేయగలరు. ఈ అకౌంట్‌ను 10 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్లల కోసం ఓపెన్ చేయొచ్చు. తనకు 18 ఏళ్లు వచ్చేంత వరకు అకౌంట్ ఓపెన్‌లో ఉంటుంది. ఏడాదికి 8.2 శాతం వడ్డీని ఇస్తున్నారు.
మూతపడిన నేషనల్ సేవింగ్స్ స్కీమ్–87
ఏప్రిల్ 2, 1990 కి ముందు ఓపెన్ అయిన ఎన్‌ఎస్‌ఎస్ 87 అకౌంట్లలో ప్రైమరీ అకౌంట్ ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న వడ్డీని పొందుతోంది. కానీ, మిగిలిన సెకెండరీ అకౌంట్లపై పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్ (4 శాతం) + 2 శాతం వడ్డీని ఇస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 1 తర్వాత నుంచి ప్రైమరీ, సెకెండరీ అకౌంట్లపై వడ్డీ రాదు. 1990 ఏప్రిల్ 2 తర్వాత ఓపెన్ అయిన ఎన్‌ఎస్‌ఎస్ 87 అకౌంట్లలో ప్రైమరీ అకౌంట్లపై ప్రస్తుత రేట్‌ను ఇస్తారు. కానీ, సెకెండరీ అకౌంట్‌పై పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ రేట్ ఇస్తారు. అక్టోబర్ 1 తర్వాత ఈ రెండు అకౌంట్లపైనా వడ్డీ ఇవ్వరు.