మన దేశంలో ప్రాథమిక హక్కైన విద్య ప్రస్తుతం విద్య సామాన్యడికి అందని ద్రాక్షగా, అంగట్లో సరుకుగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే. విద్యను తమ ఆధీనంలో ఉంచుకొని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత విద్యను అందిచాల్సిన ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేసి భారం తగ్గించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి ఏటా వందల సంఖ్యలో రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ బడులు మూతపడేలా చేస్తూ, విద్యను నిర్వీర్యం చేస్తున్నాయి. చాలా ప్రభుత్వ బడుల్లో సరైన భవనాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు స్టూడెంట్స్ సంఖ్యకు తగిన రీతిలో ఉపాధ్యాయులు కూడా లేకపోవడం వంటి కారణాలతో ప్రజల్లో సర్కార్ విద్యపై ఆసక్తిని తగ్గించాయి. దేవిధంగా మరికొంత మంది టీచర్లు దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తుండడం కూడా వారు విద్యార్థుల పైన సరైన శ్రద్ధ వహించలేక పోతున్నారు. కారణాలేవైనా పేద, మద్య తరగతి వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన సర్కారు విద్యను అదించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనికి తోడు ప్రభుత్వం ఇస్టానుసారంగా ప్రైవేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. సర్కార్ పాఠశాలల్లోని విద్యాబోధన పైన అసంతృప్తగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ సూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణతో పాటు, ప్రైవేట్ స్కూళ్ల నిర్వహణ, పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు, ఆరోగ్య భద్రత, నాణ్యమైన విద్యపై ఒక నియంత్రణ కమిటీ వేసి ఒక గట్టి చట్టం తేవాలి. అప్పడే ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది.
- బయ్యా శివరాజ్, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.