గవర్నమెంట్​ హాస్పిటల్​లో వెంటిలేటర్ల రిపేర్లకు పైసల్లేవ్!

 గవర్నమెంట్​ హాస్పిటల్​లో వెంటిలేటర్ల రిపేర్లకు పైసల్లేవ్!
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లా గవర్నమెంట్​ హాస్పిటల్​లో మందుల కొరత
  • సరైన వైద్యం అందక ఇబ్బందుల్లో పేషెంట్లు 
  • పేరుకుపోయిన బకాయిలతో ఆఫీసర్ల అవస్థలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్ను మందుల కొరత వెంటాడుతోంది. పేరుకు పెద్దాసుపత్రి. కానీ వెంటిలేటర్లు, ఇతర​ మిషన్ల రిపేర్లకు పైసల్లేని పరిస్థితి నెలకొంది. రోగులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. బడ్జెట్​ కేటాయింపులు లేకపోవడం, గతంలోని బకాయిలు పేరుకుపోవడంతో మెడికల్​ డిస్ట్రిబ్యూటర్లు మందులను సప్లై చేసేందుకు నిరాకరిస్తున్నారు. 

ఇదీ పరిస్థితి..

అత్యవసరమైన సమయాల్లో కీలకంగా ఉపయోగించే వెంటిలేటర్లు జిల్లా గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​లో మొత్తం10 ఉన్నప్పటికీ అందులో రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతావాటికి రిపేర్లు చేస్తే అందుబాటులోకి వస్తాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. హాస్పిటల్​లో బయోమెడికల్​ ఇంజినీర్​ లేకపోవడంతో బయోమెటికల్​లో ఏదేని రిపేర్లు వస్తే హైదరాబాద్​ నుంచి పిలుపించుకోవాల్సి వస్తోందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

అలా పిలిపించినా వారు వెంటనే రాకుండా వాళ్లకు వీలున్నప్పుడు వస్తుండడంతో సమస్య వెంటనే పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. బయోమెడికల్ ఇంజినీర్​ను ఇక్కడే ఉండే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెడికల్​కాలేజీకి అనుబంధంగా రామవరంలో ఉన్న మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్​లోనూ వెంటిలేటర్లు రిపేర్​లోనే ఉన్నాయి. 

మందుల కొరత...

గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​ లో  మెరుగైన ట్రీట్​మెంట్​తో పాటు అన్ని రకాల మందులు లభిస్తాయని రోగులు ఆశపడుతారు. కానీ ఇక్కడ మాత్రం సరైన మందులు అందుబాటులో లేవు. చేసేదిలేక మెడిసిన్​ ప్రైవేట్​లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ ప్రజలకు ఇచ్చే ట్యాబెట్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్​ వ్యాధులు ప్రబలకముందే హాస్పిటల్​కు మందుల కొరత లేకుండా చూడాలని, లోకల్​ పర్చేస్​లో భాగంగా అవసరమైన మందులు, సర్జికల్​ పరికరాల కోసం ఉన్నతాధికారులు ఫండ్స్​ రిలీజ్​ చేయాలని పలువురు కోరుతున్నారు. 

ఉన్నంతలో బెటర్​ ట్రీట్మెంట్​

ఉన్నంతలో మెరుగైన వేద్య సేవలందిస్తున్నాం. సెంట్రల్​ డ్రగ్​స్టోర్​ నుంచి అవసరమైన మందులు రావడంలో కొంత ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే. తప్పని పరిస్థితి అయితేనే ట్యాబ్​లెట్లు బయటికి రాస్తున్నాం. దాదాపు ఏడాదిన్నరగా బడ్జెట్​ కేటాయింపులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ఉన్న వారు పేరుకుపోయిన బకాయిలను చెల్లించకపోవడంతో ఇప్పుడు మేం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

రాధామోహన్​, హాస్పిటల్​ సూపరింటెండెంట్, భద్రాద్రికొత్తగూడెం

రూ.లక్షల్లో బకాయిలు

జిల్లా గవర్నరమెంట్​ హాస్పిటల్​కు సరైన విధంగా బడ్జెట్​ కేటాయింపులు లేకపోవడంతో వైద్యాధికారులు ఇబ్బందులు పడుతున్నారు. లోకల్​ పర్చేస్​లో భాగంగా అవసరమైన మందులు, సర్జికల్​ పరికరాలకు సంబంధించి మెడికల్ ​డిస్ట్రిబ్యూటర్లు ఇద్దెరగా ఇవ్వడం లేదు. పాత బకాయిలు దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. 70లక్షల వరకు ఉండడంతో గవర్నమెంట్​ హాస్పిటల్​కు ఖాతా పెట్టాలంటే డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు. ఆక్సీజన్​ సిలెండర్లు సప్లై చేసే కాంట్రాక్టర్​కు దాదాపు రూ. 13లక్షల వరకు బకాయిలున్నాయి.