- మొదలైన మన ఇసుక వాహనం వెబ్ సైట్
- అక్రమార్కుల ఆగడాలకు చెక్
- దూరాన్ని బట్టి ట్రాన్స్ పోర్ట్ చార్జీలు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఇండ్లు కట్టుకునే వారికి ఇసుక కష్టాలు దూరం కానున్నాయి. సర్కారే రీచ్ ల నుంచి ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఆన్ లైన్ లో అమౌంట్ చెల్లించి ఇసుకను బుక్ చేసుకునేందుకు ఈనెల 14న ‘మన ఇసుక వాహనం’ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం జనాలకు అవగాహన కల్పిస్తోంది. గత సర్కార్ హయాంలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసినా.. అధికార పార్టీ లీడర్లే ఇసుక దందాకు తెరలేపారు.
ఇదే అదునుగా అక్రమార్కులు దోపిడీకి పాల్పడడంతో సామాన్యుడికి ఇసుక ఖరీదుగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి ఆన్ లైన్ సౌకర్యం కల్పించడంతో ఖజానాకు ఆమ్దానీతోపాటు జనానికి తక్కువ ధరకు ఇసుక దొరికే అవకాశం ఉంది.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఇసుకే దిక్కు
జిల్లాలో ఇసుక రీచ్ లు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అక్రమ ఇసుకపై ఆధారపడే పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా తీసుకున్న నాటి పాలకపక్ష లీడర్లు ఇసుక దందాకు తెరలేపారు. ఇష్టారీతిన వసూల్ చేసేవారు. దీంతో ఇండ్లు నిర్మాణాలు, ఇతర నిర్మాణదారులు ఇసుక కోసం ఎక్కువ చెల్లించాల్సి వచ్చేది. ఇసుక అవసరాలను గుర్తించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 2024 జనవరి 2న ఇసుక రీచ్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆమె ఇసుక రీచ్ ల ఏర్పాటుకు ఆఫీసర్లను ఆదేశించారు. ఆఫీసర్ల నివేదిక ఆధారంగా ఇసుక రీచ్ లను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 2న ఉత్తర్వులు జారీ చేశారు.
ఫిబ్రవరి 14న వెబ్ సైట్ ప్రారంభం
జిల్లాలోని ధర్మపురి మండలం రాజారాం, ఆరేపల్లి, కోరుట్ల మండలం పైడిమడుగు, రాయికల్ మండలం కుటిక్యాల, జగన్నాథ్ పూర్, మల్లాపూర్ మండలం సాతారం, మెట్ పల్లి మండలం ఆత్మకూర్, కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామాల్లో ఆరు ఇసుక రీచ్ లను ఏర్పాటు చేశారు. వీటి నుంచి ‘మన ఇసుక వాహనం’ వెబ్ సైట్ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
సంబంధిత రీచ్ నుంచి ఉన్న దూరాన్ని బట్టి ఇసుక ధరను నిర్ణయిస్తున్నారు. 5 కిలో మీటర్ల లోపు ట్రాక్టర్ ఇసుక ధర ట్రాన్స్ పోర్ట్ కలిపి సుమారు రూ.1500, 50 కిలో మీటర్ల లోపు రూ.5 వేలు వరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. చెల్లింపులు కూడా ఆన్ లైన్ లో చేయాల్సి ఉంటుంది. అలాగే వినియోగదారుల కోసం హెల్ప్ డెస్క్ 040-23120421/ 8333923732/ 9032299262 కూడా అందుబాటులో ఉంచినట్లు ఆఫీసర్లు తెలిపారు.
అక్రమార్కులకు చెక్
గోదావరి తీర ప్రాంతాలైన ధర్మపురి, రాయపట్నం, ఇటిక్యాల, పైడిమడుగు, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో కొంతమంది అక్రమార్కులు ఇష్టానుసారంగా ఇసుకను తవ్వకాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో విలేజ్ డెవలప్ మెంట్ కమిటీలు వేలం వేసి ఇసుక టెండర్లు కట్టబెట్టారు. మరికొన్ని గ్రామాల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి మామూళ్లు ఇచ్చి ఇసుక తరలించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన మన ఇసుక వాహనం వెబ్ సైట్ ద్వారా సరఫరా పెరిగితే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు అక్రమార్కులకు చెక్ పడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.