నామినేషన్లకు మిగిలింది మూడు రోజులే

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు :  నామినేషన్లు వేసేందుకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. 8,9,10 తేదీల్లో ముహూర్తాలు బాగుండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ  చేసే వారంతా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 నియోజకవర్గాల లోని ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు 13 నామినేషన్లు వేశారు. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ తరపున సిటీ మేయర్ పూనుకొల్లు నీరజ, రఘునాధపాలెం జడ్పీటీసీ ప్రియాంక దాఖలు చేశారు.

ఇక స్వతంత్ర అభ్యర్థులుగా మార్కపూడి శ్రీనివాసులు, పాల్వంచ రామారావు, రామజహవాలా రవికుమార్, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ తరపున కుక్కల నాగమణి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభికి అందజేశారు. పాలేరు అసెంబ్లీ స్థానానికి అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ తరపున కుక్కల నాగయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా ఇస్లావత్ రవీందర్, తెలగమల్ల రాంబాబు, గుగులోత్ సురేశ్, బీజేపీ అభ్యర్థిగా నున్నా రవికుమార్ నామినేషన్​ వేశారు. వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గుగులోత్ తావుర్య, సత్తుపల్లిలో స్వతంత్ర అభ్యర్థిగా పాతకోటి అరుణ నామినేషన్​ వేశారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..

జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మంగళవారం 13 మంది అభ్యర్థులకు గానూ 17నామినేషన్లను వేశారు. పినపాక నియోజకవర్గంలో రెండు, ఇల్లెందు నియోజకవర్గంలో 7, కొత్తగూడెం నియోజకవర్గంలో 4, భద్రాచలంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇల్లెందు నుంచి కాంగ్రెస్​ తరపున జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, బీజేపీ నుంచి ధారావత్​ రవీందర్​ నాయక్​, బీఆర్​ఎస్​ నుంచి భానోత్​ హరిప్రియ, కొత్తగూడెం నుంచి జనసేన తరుపున లక్కినేని సురేందర్​ దాఖలు చేయగా, మిగతావాళ్లు ఇతర పార్టీల నుంచి, ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు.