ఖమ్మం జిల్లాలో తొలిరోజు 8 నామినేషన్లు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా తొలిరోజు నాలుగు నియోజకవర్గాల్లో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. 

ఖమ్మం జిల్లాలో ఐదు.. 

ఖమ్మం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా తొలి రోజు ఖమ్మంలో మూడు, పాలేరులో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మంలో తొలిరోజే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి వచ్చి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

స్వతంత్ర అభ్యర్థిగా కొంకిమల్ల సాయి కుమార్, పిరమిడ్ పార్టీ నుంచి కాటేపల్లి శైలజ తమ నామినేషన్లు వేశారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. నిరంకుశ, అవినీతి,అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రఘునాథపాలెం మండల ఎంపీపీ భూక్య గౌరీ, కార్పొరేటర్ కమర్తపు మురళి ఉన్నారు. 

పాలేరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బుడగజంగం సాయిలు, ఆమ్​ఆద్మీ పార్టీ నుంచి పసుపులేటి శ్రీనివాస రావు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఖమ్మం రూరల్ రెవెన్యూ కార్యాలయంలో పాలేరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్వరికి పత్రాలను అందజేశారు.
 
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మూడు.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా మొదటి రోజు కొత్తగూడెం నియోజకవర్గంలో ఇద్దరు, ఇల్లెందు నియోజకవర్గంలో ఒకరు నామినేషన్లు వేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో గుండపనేని సతీశ్​, ఇమంది ఉదయ్​ కుమార్​ ఇండిపెండెంట్లుగా పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్​లో రిటర్నింగ్​ ఆఫీసర్​కు నామినేషన్​ పత్రాలు అందజేశారు. 

ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఇల్లెందు తహసీల్దార్​ ఆఫీస్​లో రిటర్నింగ్​ ఆఫీసర్ కాశయ్య​కు పాలెబోయిన రవి ఇండిపెండెంట్​గా నామినేషన్​ పత్రాలను సమర్పించారు.