పెళ్లి వేడుకలో గన్ తో కాల్పులు జరిపిన వధువు

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కలకలం రేపింది. పెళ్లి కూతురే రివాల్వర్ తో ఐదు సెకండ్లలో గాల్లో నాలుగు రౌండ్ల కాల్పులు  జరిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అసలేం జరిగింది..?

హత్రాస్ లోని సేలంపూర్ గ్రామంలో పెళ్లికి వచ్చిన ఓ వ్యక్తి.. తన వద్ద ఉన్న రివాల్వర్ ను తీసి.. పెళ్లి కూతురికి ఇచ్చాడు. రివాల్వర్ ను తీసుకున్న వధువు.. ఐదు సెకండ్లలో నాలుగు రౌండ్లను గాల్లోకి కాల్పులు జరిపింది. అక్కడే ఉన్న వారంతా శబ్ధానికి భయపడ్డారు. పక్కన ఉన్న పెళ్లికొడుకు సైతం ముందుగా కాస్త భయపడ్డాడు. ఆ తర్వాత తేరుకుని ఊపిరి పీల్చుకున్నాడు. 

పెళ్లికూతురు గాల్లోకి కాల్పులు జరుపుతున్న సమయంలో పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు నవ్వుతూ కనిపించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నూతన దంపతులు ఒకరినొకరు పూలమాలలు వేసి, బంధువుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసులు ఈ చర్యను చాలా సీరియస్ గా తీసుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన పెళ్లికూతురు, ఆమెకు రివాల్వర్ ఇచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేసి, వారిని విచారిస్తామని హత్రాస్ ASP అశోక్ కుమార్ సింగ్ తెలిపారు.