మునుగోడులో టీఆర్ఎస్​ లీడర్ల నడుమ పైసల లొల్లి

యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి.. టీఆర్ఎస్ సంబురాలు, సందడి ముగిశాయి. రెండు వారాలు కూడా గడిచిపోయాయి. కానీ నియోజకవర్గంలో పైసల హీట్​ఇంకా చల్లారలేదు. ఓటర్లకు పంచకుండా దాచుకున్న డబ్బు లెక్కలపై లోకల్ ఇన్​చార్జిలుగా వ్యవహరించిన టీఆర్ఎస్​లీడర్లు పరస్పరం గల్లాలు పట్టుకుంటున్నారు. పలుచోట్ల గొడవ ముదిరి ఠాణా మెట్లు ఎక్కేదాకా పరిస్థితి వచ్చింది. ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్​ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. ముఖ్యంగా ఓటర్లకు పంచాల్సిన పైసల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించింది. పార్టీలతో సంబంధం లేకుండా, ఓటర్ల సంఖ్య ఆధారంగా లోకల్​లీడర్లకు పైసలు పంపినట్లు చెప్తున్నారు. కానీ చాలా మంది వార్డు ఇన్​చార్జిలు ఓటర్లకు సగం సగం పంచి, మిగిలిన మొత్తం నొక్కేసినట్లు తెలుస్తోంది. కొందరు టీఆర్ఎస్ మద్దతుదారులకు ఇచ్చి, ఇతర పార్టీలవాళ్లను వదిలేయగా, ఇంకొందరు టీఆర్ఎస్​వాళ్లకు కూడా ఇవ్వలేదనే అనుమనాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్లే తాజాగా లోకల్​ లీడర్ల మధ్య పైసల లొల్లి మొదలైంది. ‘పంచకుండా దాచిన పైసలెవ్వి..’ అంటూ ఒకరినొకరు నిలదీసుకోవడం చర్చయనీయాంశంగా మారింది.   

గ్రామాల్లో గొడవలు

సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో రూ. 6 లక్షలు లెక్క తేలకపోవంపై లోకల్​ఇన్ చార్జిల మధ్య గొడవ జరుగుతోంది. గ్రామంలో 800కు పైగా ఓట్లు ఉన్నాయి. ఊర్లో ఉండే ఓటర్లకు రూ.3 వేల చొప్పున , హైదరాబాద్​లో ఉండే ఓటర్లకు రూ.3,500 చొప్పున  పంచేలా పైసలు వచ్చినట్లు టీఆర్ఎస్​లీడర్లు చెబుతున్నారు. కానీ 600 ఓటర్లకు మాత్రమే డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ కులానికి చెందిన ఓట్లు 130 ఉండగా, కేవలం 80 మందికి మాత్రమే రూ.3వేల చొప్పున అందాయి. మిగిలినవాళ్లకు అందలేదు. ఇలా గ్రామంలో 200 ఓటర్లకు ఇవ్వలేదని తేల్చారు. అంటే రూ.6 లక్షలు ఏమయ్యాయి? ఎవరు తిన్నారు? అంటూ గ్రామంలో ప్రస్తుతం గొడవ జరుగుతోంది. దీనిపై టీఆర్ఎస్ లీడర్లు గల్లాలు పట్టుకోగా,  కొందరు పోలీస్​స్టేషన్​కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చౌటుప్పల్​ మండలంలోని డీ నాగారంలో కూడా  రూ.5 లక్షల లెక్క తేలకపోవడంతో ఇన్​చార్జిగా వ్యవహరించిన లీడర్​ను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. సంస్థాన్​ నారాయణపురం​ మండలంలోని ఓ గ్రామంలో వార్డు ఇన్​చార్జ్ తనకు అందిన పైసలన్నీ తన దగ్గరే పెట్టుకున్నట్లు తెలిసింది. ఇదేమని అడిగితే తాను పైసలు తెస్తుంటే పోలీసులు పట్టుకున్నారని నమ్మించే ప్రయత్నం చేయగా, ఠాణాలో ఆరా తీసినట్లు సమాచారం.

బాపూజీ విగ్రహం పైసలపైనా లొల్లి

ఎన్నికల సందర్భంగా సంస్థాన్​ నారాయణపురంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు వచ్చిన డొనేషన్లపై లొల్లి నడుస్తోంది. విగ్రహ ఏర్పాటు కోసం అన్ని పార్టీల నుంచి రూ. 6 లక్షల దాకా డొనేషన్లు అందాయి. ఇందులో విగ్రహ ఏర్పాటుకు రూ.1.50 లక్షలే ఖర్చయ్యాయని, మిగిలిన డబ్బు ఏమైందని అక్కడి లీడర్లను ఇటీవల నిలదీశారు.  దీనిపై కొందరు మాట దాటేస్తూ ఉండడంతో చివరకు రోడ్డుపైనే వాగ్వాదం జరిగింది. కొందరు పోలీస్​ స్టేషన్​కు వెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకొని మాట్లాడుకుందామని నచ్చజెప్పినట్టు తెలిసింది. మునుగోడు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇలా పైసల పంచాయితీ నడుస్తుండగా, ఇది ఎక్కడికి దారి తీస్తుందోననే చర్చ జరుగుతోంది.